ఉరికిస్తాం.. డేట్, టైం ఫిక్స్ చెయ్: కొండా మురళి వర్సెస్ చల్లా ధర్మారెడ్డి రాజకీయం!!
ఇటీవల కేటీఆర్ పర్యటన వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి రగిల్చింది. కేటీఆర్ పర్యటన తర్వాత కేటీఆర్ నుద్దేశించి కొండ మురళి, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.దమ్ముంటే వచ్చి పరకాలలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
కొండా మురళి, కొండా సురేఖ భాష మార్చుకోవాలని హితవు పలికారు. కొండా మురళి కుమార్తె కూడా వయసు నుంచి మాట్లాడుతుందని మండిపడ్డారు. పరకాలలో గెలవలేక వరంగల్ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఉరికించి కొట్టారని, అదే మళ్లీ భవిష్యత్తులో రిపీట్ అవుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు.

చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కొండా మురళి అసలు ధర్మారెడ్డికి మా ఇంటి గేటు తెలుసా అంటూ ప్రశ్నించారు. నీ అంతు తేల్చడానికే వచ్చాను నేను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, కొండా సురేఖ, తన బిడ్డ భాష బాగోలేదని చెప్పడంలో అర్థం లేదన్నారు.
పైపులు అమ్ముకొని బతికే వాడివని, కడియం శ్రీహరి దగ్గర ఉండి పదవులు పొందిన వాడివి అంటూ చల్లా ధర్మారెడ్డిని కొండ మురళి తిట్టిపోశారు. పరకాలలో నువ్వు చేసిన అవినీతి, అక్రమాలు ప్రజలను ఎవరు అడిగినా చెబుతారని పేర్కొన్నారు. అలాంటి నువ్వు నాపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు కొండా మురళి.
పరకాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చల్లా ధర్మారెడ్డి ఉరికించడం ఖాయమని కొండా మురళి పేర్కొన్నారు. అధికారం ఎక్కువ రోజులు ఉండదని, అధికార గర్వం తో మాట్లాడితే దెబ్బ తింటావ్ అని హితవు పలికారు. కొండ మురళి భయపడేవాడు కాదని భయం అనేది తన వంశంలోనే లేదన్నారు. పరకాలలో తాము ధైర్యంగా ప్రచారం చేస్తారని, దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు.
చెంచాగిరి అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉందని పేర్కొన్న కొండా మురళి, తాను ఎక్కడికి రావడానికైనా సిద్ధమని డేటు, టైము ఫిక్స్ చేయమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీలో దొరల పాలన సాగుతుందన్నారు. మైసమ్మ సాక్షిగా కొండ మురళి చెబుతున్నాడు నిన్ను పరకాలలో ఓడగొట్టటం ఖాయమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications