కేసీఆర్‌పై కేసులు పెడతారా, ఎందుకు?: కేటీఆర్
చేవెళ్ల: దశాబ్దాలుగా పదవులను విడవకుండా గద్దల్లా, గబ్బిలాల్లా పట్టుకుని ప్రజల గురించి ఏనాడు ఆలోచించని నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కేసులు పెడతానంటున్నారని, అసలెందుకు పెడతారని కాంగ్రెస్ నేతలను తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రూ.11.57 కోట్ల వ్యయంతో 70 కిలోమీటర్ల పొడవు రీబిటి పనులు, షాబాద్ చౌరస్తాలో పీఎంజీఎస్‌వై ద్వారా కందాడ నుంచి రూ.8.10 కోట్లతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

నాడు తెలంగాణ కోసం ప్రజలు కొట్లాడుతుంటే, పదవుల కోసం పెదవులు మూసుకున్న నాయకులంతా నేడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ పైన కేసులు పెడతానని ఒకరు, కోర్టుకు ఈడుస్తానని మరొకరు.. అంటారని మండిపడ్డారు.
నిన్న మొన్నటిదాక అధికారంలో ఉన్న పెద్దలను అడుగుతున్నా కేసీఆర్ ఏం తప్పు చేసిండ్రని ప్రశ్నించారు. మీ హయాంలో ముసలి వాళ్లకు ఊరూరా రూ. 200 రూపాయల పింఛన్లు ఇచ్చారని, రెండు వందల రూపాయల పింఛన్లతో ముసలొల్లకు మందు బిళ్లలు వచ్చే పరిస్థితి లేకుండెనని, పింఛన్లు పెంచినందుకు కేసీఆర్‌పై కేసుడు పెడతారా అని ప్రశ్నించారు.
వేయి రూపాయలు పింఛన్ ఇచ్చి పెద్ద కొడుకు మాదిరిగా ఆదుకుంటున్నందుకు పెడతారా అన్నారు. వికలాంగులకు రూ.500 పింఛన్ ఇస్తే ఈ రోజు దాన్ని రూ. 1500 చేశారని,అలా అండగా నిలబడ్డందుకు కేసులు పెడతారా అన్నారు. తెలంగాణలో ఆడ బిడ్డలు రోడ్డు మీదకు బిందెలు పట్టుకుని నడుచుకుంటూ నీళ్లకోసం పొయే పరిస్థితి ఉండొద్దన్న ఉద్దేశంతో ఇంటింటికి రాబోయే నాలుగేళ్లలో నీరిచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications