మునుగోడులో ప్రభాకర్, రాజగోపాల్‌కి మధ్య పోటీ కాదు..: బీజేపీపై కేటీఆర్, హరీశ్ ఫైర్
నల్గొండ: మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఈరోజే చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా సంస్థాన్ నారాయణపూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య పోరాటం కాదని.. మోడీ వైఫల్యాలు, కేసీఆర్ సంక్షేమ పథకాల మధ్య పోరు అని అన్నారు.
వారి అహంతోనే మునుగోడు ఉపఎన్నిక అంటూ కేటీఆర్
రాజగోపాల్ రెడ్డి రూ. 18వేల కోట్లకు అమ్ముడుపోయి.. మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టారని విమర్శించారు. మోడీ, రాజగోపాల్ రెడ్డి అహంతో ఉపఎన్నిక వచ్చిందని కేటీఆర్ అన్నారు. ప్రలోభాలకు లొంగిపోవద్దని ఓటర్లను కోరారు కేటీఆర్. డబ్బులకు, సారాకు అమ్ముడుపోతే.. అన్ని ధరలు మరింతగా పెరుగతాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క మంచి పని చేసిందా? అని ప్రశ్నించారు. ఎంత రెచ్చగొట్టినా టీఆర్ఎస్ శ్రేణులు సంయమనం కోల్పోవద్దని.. ఓట్లతోనే బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలుంటాయన్నారు.
రూ. 18వేల కోట్ల కోసమే రాజగోపాల్ రాజీనామా అంటూ హరీశ్
మరోవైపు, మంత్రి హరీశ్ రావు కూడా మునుగోడు ఎన్నికల ప్రచారంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ డిమాండ్ల సాధన కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ప్రశ్నించారు. తన స్వార్థం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని మండిపడ్డారు. రూ. 18వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి ఏదైనా ఇచ్చామని బీజేపీ నేతలు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ తిట్టడమే తప్ప..: బీజేపీపై హరీశ్ రావు ఫైర్
కేసీఆర్‌ను తిట్టి ఓట్లు అడగడం తప్ప.. ఏమైనా ఇచ్చామని చెప్పారా? అని బీజేపీ నేతలపై హరీశ్ రావు మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే సిలిండర్ ధరలు మోడీ ఇంకా పెంచుతారని అన్నారు. అన్ని ధరలు పెరుగుతాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలన్నారు. బీజేపీ శ్రేణులే దాడులకు పాల్పడుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు.












Click it and Unblock the Notifications