ముఖ్యమంత్రి పదవి, హరీష్ రావుపై వంటేరు వ్యాఖ్యలు, విభేదాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లలో గెలుపొందడం ఖాయమని, సమయం చూసి కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలంగాణ మంత్రి (ఆపద్ధర్మ) కేటీ రామారావు మంగళవారం అన్నారు. ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఇటీవల సహచర మంత్రి హరీష్ రావు పైన కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
మహాకూటమి పుంజుకోవడం లేదని, వారు సీట్ల కోసం ఇంకా సిగపట్లు పడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమ ప్రత్యర్థులు తేలకపోవడం వల్లే తమ పార్టీ అధ్యక్షులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంకా ప్రచారం ప్రారంభించలేదని చెప్పారు. సరైన సమయంలో ప్రచారం చేయడానికి కేసీఆర్ సిద్ధమని చెప్పారు.

కేసీఆర్ చెప్పినట్లుగా 100 సీట్లు సాధిస్తాం
తెరాసలో 99 శాతం అసంతృప్తి, అసమ్మతి పోయిందని కేటీఆర్ చెప్పారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినట్లు తమ పార్టీ కచ్చితంగా 100 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీపీఐ, తెలంగాణ జన సమితి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో కలిసిన కూటమి ప్రజలలో విశ్వాసాన్ని కల్పించలేకపోయిందని చెప్పారు.

కోదండరాం పోటీ చేసేదే మూడు స్థానాల్లో, దానికి మేనిఫెస్టోనా?
తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం పోటీ చేసేది కేవలం మూడు స్థానాల్లో అని, దానికి మేనిఫెస్టో ప్రకటించడం విడ్డూరమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌కు, తెరాసకు అనుకూల పవనాలు ఉన్నాయని చెప్పారు.

చంద్రబాబు రాజకీయాలు ఇక్కడ చెల్లవు
తెలంగాణలో కుల పిచ్చి లేనే లేదని, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్న రాజకీయాలు ఇక్కడ చేస్తామంటే అవి చెల్లవని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ మ్యూజియంగా మారుతుందని చెప్పారు. చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని చెప్పారు. తెలంగాణలోని సెటిలర్స్ తమ వైపే ఉంటారని చెప్పారు. కాంగ్రెస్‌ను అడ్డు పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు.

హరీష్ రావుపై దిక్కుమాలిన మాటలు
గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేసీఆర్ నాలుగేళ్లలో చాలా మార్చేశారని కేటీఆర్ చెప్పారు. తమ పార్టీ నేత హరీష్ రావు పైన విపక్షాలు చేస్తున్న విమర్శలు దిక్కుమాలినవి అని మండిపడ్డారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు హరీష్ రావుతో, పార్టీలోని ఇతర నేతలతో విభేదాలు లేవని చెప్పారు.తామంతా కలిసి పని చేస్తున్నామన్నారు. రాజకీయాలు, అధికారం కంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదని, దానిని ఎప్పుడూ వీడబోమని చెప్పారు. మరో పదిహేనేళ్లు కేసీఆరే సీఎం అన్నారు.
ఇటీవల హరీష్ రావు పైన గజ్వెల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

టీడీపీ, కాంగ్రెస్ నేతల సంచలన వ్యాఖ్యలు
తెరాసలో హరీష్ రావు అసంతృప్తితో ఉన్నారని, సమయం కోసం వేచి చూస్తున్నారని, గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్‌ను ఓడించాలని, అవసరమైతే ఆర్థిక సాయం చేస్తానని హరీష్ రావు తనతో చెప్పారని వంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరుసటి రోజు రేవూరి మాట్లాడుతూ... టీఆర్ఎస్, మహాకూటమికి సమాన సీట్లు వస్తే హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. దీనిపై కేటీఆర్ పైవిధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications