పొలం ఉన్న రైతులనూ పొట్టనపెట్టుకున్నారు: రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణమని అన్నారు. పొలం ఉన్న రైతులనూ పొట్టుబెట్టుకుంటున్నారు. కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణం. ఓవైపు సాగునీటి సంక్షోభం. మరోవైపు రుణమాఫీ ద్రోహం. ఇంకోవైపు రైతుభరోసా మోసం. కౌలు రైతులకూ అందని సాయం.
రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలనుఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం అంటూ కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ధ్వజమెత్తారు.

వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా చలనం లేదు. ముఖ్యమంత్రికి సోయి లేదు.. ప్రభుత్వానికి బాధ్యత లేదు. దసరా పండుగ వేళ..
వ్యవసాయాన్ని దండుగలా మార్చిన.. సీఎం రేవంత్ కు రైతన్నల చేతిలో దండన తప్పదు. అన్నదాతలారా ఆత్మస్థయిర్యం కోల్పోకండి..!
ముంచే రోజులు పోతాయ్..!! మళ్లీ మంచిరోజులొస్తాయ్..!!!
జై కిసాన్ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు.
మరోవైపు, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలన్నారు.
గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును నిలిపివేశారు, రైతు భరోసా దిక్కులేకుండా పోయింది, బోనస్‌ను బోగస్ చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు, పది నెలలు గడిచాయి అతీ గతి లేదు. నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు అని కాంగ్రెస్ సర్కారుపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.
ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ - బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడిక్కడ నిలదీయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications