బీఆర్ఎస్ కు కొత్త అధ్యక్షుడు- కీలక నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ వేగంగా ముందుకెళ్తోంది. ఇద్దరు అధికారులను ఈ రోజు ఏసీబీ విచారిస్తోంది. రేపు కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. మొన్న కవిత.. ఇప్పుడు కేటీఆర్ కేసులతో చిక్కులు ఎదుర్కుంటున్నారు. వీటిని గమనిస్తున్నా.. కేసీఆర్ స్పందించటం లేదు. ఈ సమయంలో బీఆర్ఎస్ కు కొత్త అధ్యక్షుడి నియామకం పైన చర్చ మొదలైంది.
కీలక పరిణామాలు
కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేసు కేసు విచారణ వేళ రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసు కుంటున్నాయి. పార్టీ నేతలతో కేటీఆర్, హరీష్ సమావేశమయ్యారు. కేసు విచారణ వేళ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసు గురించి తాను చూసుకుంటానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇది పెద్ద విషయం కాదన్నారు. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ రేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని చెప్పుకొచ్చారు. పార్టీ శ్రేణులు రైతు, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పార్టీ నిర్మాణం.. కమిటీల ఏర్పాటు గురించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

కొత్త అధ్యక్షుడిగా
ఈ ఏడాది పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకుంటామని కేటీఆర్ వెల్లడించారు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిణామాల వేళ కేసీఆర్ తిరిగి అధ్యక్షుడిగా కొనసాగుతారా.. మరో ఆలోచన చేస్తారా అనేది పార్టీలో చర్చగా మారింది. కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే చర్చ..అదే విధంగా బీసీకి ఇస్తారనే వాదన మధ్య కేసీఆర్ నిర్ణయం కీలకంగా మారుతోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ తానే అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీలో మరి కొందరు చెబుతున్నారు. ఈ ఎన్నిక గురించి పార్టీ నేతల కు కేటీఆర్ దిశా నిర్దేశం చేసారు. 2025లో బీఆర్ఎస్‌కు కొత్త కమిటీలు పూర్తి చేస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు నియమిస్తామని చెప్పారు.
కేటీఆర్ కు అండగా
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డైవర్షన్ లు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదని హరీష్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా వేస్తారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌లు పెంచిందని గుర్తు చేసారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులకు అండగా కేటీఆర్ నిలబడ్డారని.. కేటీఆర్ ఉద్యమకారుడు, కార్యకర్తే అని తెలిపారు. కేటీఆర్ కు కష్టం వస్తే బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా అండగా నిలబడుతుందని హరీష్‌రావు వెల్లడించారు.












Click it and Unblock the Notifications