కేసీఆర్ తో పోలిస్తే నువ్వెంత?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు లక్ష లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష లోపు రుణాలు ఉన్న వారి రుణమాఫీ జరగనున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు.
రేవంత్ సర్కార్ పై సంచలన ఆరోపణలు
రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన కేటీఆర్ రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచే ఏడువేల కోట్లు రుణమాఫీకి దారి మళ్ళించారని సంచలన ఆరోపణలు చేశారు. రైతుబంధు నిధుల నుంచి కొంత డబ్బు విదిల్చి రుణమాఫీ చేస్తున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు.

పావు వంతు రైతులకే రుణమాఫీ
ఇక లక్ష రూపాయల లోపు రుణమాఫీ పైన కూడా రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేసిన కేటీఆర్ 40 లక్షల మందికి పైగా రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే, కేవలం 11 లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018 బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కెసిఆర్ సర్కార్ రుణమాఫీ తో పోలిస్తే ప్రస్తుతం పావువంతు రైతులకు మాత్రమే రుణమాఫీలో అర్హత కల్పించారని కేటీఆర్ ఆరోపించారు.
గత ప్రభుత్వ రుణమాఫీ లెక్కలు చెప్పిన కేటీఆర్
2018 లో 37 లక్షల మందికి 19,198 కోట్ల రూపాయల అంచనాతో లక్షలోపు రుణమాఫీ చేసినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. 2014లో 16 వేల 144 కోట్ల రూపాయలు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడానికి నాటి కేసిఆర్ సర్కారు వెచ్చించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. దాంతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తో పోలిస్తే నువ్విచ్చింది ఎంతో చెప్పాలన్నారు.
కేటీఆర్ డిమాండ్
మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి ప్రస్తుతం చేస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్న కేటీఆర్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు రైతులకు హామీ ఇచ్చిన రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్ని వెంటనే మాఫీ చేయాలని అర్హులైన అందరూ రైతులకు రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications