వీడని శ్రీసాయి లక్ష్మీప్రసన్న హత్య మిస్టరీ: దగ్గరి బంధువుల పనే...
మేడ్చల్: తీవ్ర సంచలనం రేపిన ఏనిమిదేళ్ల బాిలక శ్రీసాయి లక్ష్మీ ప్రసన్న హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ఆమెను ఎవరు చంపారనే విషయం అంతు చిక్కడం లేదు. అయితే, దగ్గరి బంధువులే ఆ పనిచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేటలో బుధవారం మధ్యాహ్నం 3.40 గంటలకు భవానీ-కృష్ణమూర్తిల రెండో కూతురు శ్రీసాయి లక్ష్మీప్రసన్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మీప్రసన్నను బ్లేడుతో గొంతు కోసి ఎడమ చేయి మణికట్టును కూడా తెగనరికి బాత్రూంలో పడేశారు.
లక్ష్మీప్రసన్నను అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్నది మిస్టరీగా మారింది. బుధవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. అక్క కావ్యశ్రీ, చెల్లె శ్రీసాయి లక్ష్మీప్రసన్నలు ఇంట్లో ఉండిపోయారు. లక్ష్మీప్రసన్న హత్యకు ముందు తాత రామారావు వారి వద్దకు వచ్చి వెళ్లారు. ఆయన వెళ్లిన అరగంట తర్వాతనే లక్ష్మీ ప్రసన్న హత్యకు గురైంది.

వారి ఇంట్లో కుక్క ఉంటుందని, కొత్త వారిని ఇంట్లోకి రానివ్వదని చెబుతున్నారు. కుక్క అరవకపోవడంతో తెలిసినవారే హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాగ్ స్క్వాడ్ కూడా ఇంటి చుట్టే తిరిగి ఆగింది. గురువారం సాయంత్రం లక్ష్మీప్రసన్న అంత్యక్రియలను నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెనిక్స్ నివేదిక తర్వాత కేసు కొలిక్కి వస్తుందని డీసీపీ సాయిశేఖర్ తెలిపారు.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కృష్ణమూర్తి, భవానీ దంపతులు మేడ్చల్ మండలం ఎల్లంపేటలో స్థిరపడ్డారు. కృష్ణమూర్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా భవానీ ఓ విత్తనాల కంపెనీలో కూలీగా పనిచేస్తున్నారు. ఇంటిపక్కనే ఉండే బంధువు వెంకట లక్ష్మి అప్పుడప్పుడూ పిల్లల్ని చూసి వెళ్తుంది.
బుధవారం మధ్యాహ్నం ఆమె వెళ్లేటప్పటికి లక్ష్మీ ప్రసన్న బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉంది. కొన ఊపిరితో ఉన్న బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.
మృతురాలి చేతిలో వెంట్రుకలు
మృతురాలి చేతిలో ఉన్న వెంట్రుకలు, ఘటనాస్థలం వద్ద లభించిన బ్లేడ్, కత్తెరపై రక్త నమూనాలను డీఎన్‌ఏ పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. మృతురాలి చేతిలో హంతకుడి వెంట్రుకలు లభించడంతో సమీప బంధువే దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులకు చెందిన ఏడు సెల్‌ఫోన్ల కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.
మృతురాలి తల్లిదండ్రులు భవాని, కృష్ణమూర్తి, తాత రామరాజు, వారి సన్నిహిత బంధువుల ఫోన్ నంబర్లు సేకరించారు. ఘటనాస్థలంలో డాగ్‌స్కాడ్ తనిఖీలుచేస్తున్నప్పుడు స్నిఫర్ డాగ్ మృతురాలి తాత రామరాజుపైకి ఎగిరినట్లు తెలుస్తున్నది. ఘటనకు ముందు అతడు భోజనానికి వచ్చిననందున అక్కడే ఆయన వస్తువులు ఉండటంతో వాటి వాసన చూసిన డాగ్ అతడిపైకి ఎగిరి ఉంటుందని భావిస్తున్నారు.
మూడు నెలల క్రితం కుటుంబంలో పెద్ద గొడవ జరిగిందని స్థానికులు చెప్పినట్లు సమాచారం. కాగా, కుటుంబ వివరాల కోసం మృతురాలి తండ్రి రామరాజును ప్రశ్నించారు. కుటుంబ తగాదాలే కారణమా? మనస్పర్థలు, అనుమానాలే లక్ష్మీ ప్రసన్న హత్యకు దారి తీసిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications