బిగ్ షాక్.. భారీ స్థాయిలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల కట్టలు !
భారీగా రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల కట్టలు పట్టుబడటం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రద్దయిన ఈ నోట్ల కట్టలను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.2 కోట్ల విలువైన ఈ నోట్లు పట్టుబడటం స్థానిక ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద మరో ఇద్దరిని పట్టుకున్నారు. వీరి వద్ద ఉన్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా.. అందులో రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటి విలువ సుమారు రూ.2 కోట్లు అని పోలీసులు వెల్లడించారు.

పట్టుబడిన నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నోట్లు ఎక్కడి నుంచి.. ఎవరి వద్ద నుండి సేకరించబడ్డాయి ? ఎవరికి అందించబోతున్నారు అన్న దానిపై విచారణ చేపట్టారు. అవసరమైతే ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖలను కూడా సంప్రదించే అవకాశముందని తెలుస్తోంది.
పోలీసుల ప్రాథమిక అనుమానం ప్రకారం, ఈ నోట్లను కొత్త నోట్లుగా మార్చిస్తామని చెప్పి అమాయకులను మోసం చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో నోట్లను పట్టుకోవడం వెనుక బ్లాక్ మనీ మార్పిడి గుంపుల పాత్ర ఉండవచ్చని భావిస్తున్నారు. కాగితంగా విలువలేని నోట్లను ఇంకా కొన్ని ముఠాలు మోసాలకు వాడుతున్నారనేది స్పష్టమవుతోంది.
2016 నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటించారు. ఆ రోజు నుండి రూ.500, రూ.1000 నోట్లు చెలామణి కోల్పోయాయి. అయినప్పటికీ, దేశంలోని పలు ప్రాంతాల్లో అప్పుడప్పుడు రద్దయిన నోట్లను నిల్వ ఉంచి అక్రమ లావాదేవీలకు ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్న సమాచారం ఉంది. హైదరాబాద్‌లో తాజాగా బయటపడిన ఈ ఘటన కూడా అలాంటి యత్నమేనని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications