మునుగోడు లో గెలుపు - మెజార్టీ ఎవరికంటే : తాజా రిపోర్ట్..!!
మునుగోడు ఫలితం మరి కొద్ది గంటల్లో వెల్లడి కానుంది. ఈ సమయంలో వెలువడిన ఒక సర్వే నివేదిక మిగిలన వాటికి భిన్నంగా ఉంది. ఇప్పటికే ఫలితం పైన ఎవరికి వారు భారీ అంచనాల్లో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి. కానీ, బీజేపీ నేతలు చివరి రెండు గంటల పోలింగ్ తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. పోలింగ్ బూత్ ల వారీగా పోలింగ్ సరళి పైన ఆరా తీసారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ లో ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి వచ్చిన వారు..యువత ఎక్కువగా ఉండటంతో తమకు కలిసి వస్తుందని చెబుతున్నారు.

ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా
అటు టీఆర్ఎస్ పూర్తి విశ్వాసంతో ఉంది. ఇదే సమయంలో మిషన్ చాణక్య సంస్థ సర్వే ఫలితాలు మాత్రం హోరా హోరీ పోరు తప్పదని తేల్చాయి. అదే సమయంలో దుబ్బాక తరహాలో చివరి రౌండ్ వరకు టెన్షన్ తప్పదనేలా నివేదికలు వస్తున్నాయి. మిషన్ చాణక్యలో మొత్తంగా జరిగిన పోలింగ్ లో బీజేపీకి 40.16 శాతం పోల్ అవ్వగా.. టీఆర్ఎస్ కు 38.38 శాతం ఓట్లు పోలయినట్లుగా అంచనాలు వెలువరించారు. అదే సమయంలో కాంగ్రెస్ కు 14.93 శాతమే దక్కినట్లు సర్వేలో తేల్చారు. బీజేపీని చౌటుప్పల్ అర్బన్..చౌటుప్పల్ రూరల్ లో టీఆర్ఎస్ కంటే భారీ మెజార్టీ సాధిస్తుందని..మిగిలిన మండలాల్లో టీఆర్ఎస్ తెచ్చుకున్న మెజార్టీ ఇక్కడ అధిగమిస్తారని విశ్లేషిస్తున్నారు.

సాయంత్రం పోలింగ్ బీజేపీకి అనుకూలం
టీఆర్ఎస్ కు మర్రిగూడలో అధికంగా మెజార్టీ దక్కే అవకాశం ఉందని సర్వేలో తేల్చారు. ఫైనల్ గా బీజేపీ 3900 ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని ఆ సర్వే సంస్థ తేల్చింది. అందులో 1400 ఓట్ల వరకు ఎక్కువ..లేదా తక్కువ వచ్చే ఛాన్స్ ఉందని, ఆ లెక్కల 2500 ఓట్లతో బీజేపీ గెలుస్తుందని సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. టీఆర్ఎస్ కంటే బీజేపీ మొత్తంగా 1.78 శాతం ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని వివరించింది. మునుగోడు టౌన్ లోనూ బీజేపీ 3.39 శాతం మేర టీఆర్ఎస్ కంటే ఆధిక్యత సాధిస్తుందని పేర్కొంది.

చివరి రౌండ్ వరకు ఉత్కంఠ తప్పదా
గట్టుప్పల్.. మర్రిగూడలో బీజేపీ కంటే టీఆర్ఎస్ అధిక శాతం ఓట్లు దక్కించుకుంటుందని అంచనాకు వచ్చింది. కాంగ్రెస్ మూడో స్థానం కు పరిమితం కానున్నట్లు సర్వే లో తేల్చారు. ఒక్క నారాయణ పూర్ మండలంలో మాత్రమే చెప్పుకోదగిన స్థాయిలో కాంగ్రెస్ కే ఓట్లు పోలయినట్లు సర్వే లో తేల్చారు. ఢిల్లీకి చెందిన మరో సర్వే సంస్థ కూడా మునుగోడులో ఓటింగ్ సరళి గురించి కేంద్రంలోని బీజేపీ నేతలకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అందులో హోరా హోరీ తప్పదని..ఎవరు గెలిచినా..స్వల్ప మెజార్టీతో బయట పడతారని తేల్చినట్లుగా సమాచారం. దీంతో, మునుగోడు ఫలితం సమయం దగ్గర పడే కొద్దీ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications