రాజీనామా చేద్దాం- మల్కాజ్‌గిరి లోక్‌సభ బరిలో తేల్చుకుందాం.. రా: రేవంత్‌కు సవాల్
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఈ సంఖ్యను భారీగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని లోక్‌సభ పోలింగ్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. అటు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి ఇదే పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని అధిగమించేలా లోక్‌సభ స్థానాలను గెలచుకోవడానికి కసరత్తు సాగిస్తోంది.
మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇదివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అసెంబ్లీకి ఎన్నికైన తరువాత తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
రేవంత్ రెడ్డి సొంత లోక్‌సభ స్థానం కావడం వల్ల ఇక్కడ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు మామ అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్‌గిరి లోక్‌సభ టికెట్ ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి సైతం దీనిపైనే కన్నేసిన నేపథ్యంలో- మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం హాట్ సీట్‌గా మారింది. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తామిద్దరం మల్కాజ్‌గిరి లోక్‌సభ బరిలో తేల్చుకుందాం రా అంటూ ఛాలెంజ్ చేశారు.
తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని, కొడంగల్ శాసన సభ సభ్యత్వానికీ రాజీనామా చేసి, తనతో పోటీ పడటానికి రావాలంటూ ఆహ్వానించారు. సేఫ్ గేమ్ ఆడొద్దంటూ హితవు పలికారు. రేవంత్ రెడ్డి గుర్తింపు కోసం వెంపర్లాడుతున్నాడని, ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్.
తానే ముఖ్యమంత్రిని, తానే పీసీసీ అధ్యక్షుడిని అంటూ చెప్పుకొంటూ తిరుగుతున్నాడని కేటీఆర్ అన్నారరు. రేవంత్‌కు దమ్ముంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీ, మహిళలకు ప్రతినెలా 2,500 రూపాయల చెల్లింపు, బీసీ ప్లాన్ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రేవంత్‌కి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications