సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మరో ముందుడుగు పడింది. సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బిల్లుకు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం-2009ను సవరించింది. యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 889.7 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఏర్పాటు కానున్న ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో రాబోయే రోజుల్లో స్థానికుల ఆకాంక్షలను నెరవేర్చగలదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

ఉన్నత విద్య, పరిశోధనా సౌకర్యాలను సులభతరం చేయడంతోపాటు ప్రోత్సహిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. గిరిజన విద్యపై దృష్టి పెట్టడమే కాకుండా.. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇతర సెంట్రల్ యూనివర్సిటీల మాదిరిగానే విద్య, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గిరిజన యూనివర్సిటీ గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ములుగులో సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం నిధులు కూడా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీకి తాజాగా లోక్ సభ ఆమోదం తెలపడం గమనార్హం.












Click it and Unblock the Notifications