హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం..!
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బహదూర్‌పురా చౌరస్తా సమీపంలోని ఒక స్క్రాప్ గోదాంలో మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతంలో ఒకింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచా మంటలే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం కొంత ఊరటనిచ్చింది. కానీ ఆస్తి నష్టం మాత్రం కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే గోదాంలో చెక్క క్యాబినెట్‌లు, ప్లాస్టిక్, పేపర్, ఇనుము వంటి దహన పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న ఆర్కే టవర్ నివాసితులు భయాందోళనకు గురయ్యారు. సమీప ఇళ్లలోని వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి.. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కాగా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, GHMC డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు..
దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ప్రయత్నాల తర్వాత మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే గోదాంలోని పెద్ద మొత్తంలో స్క్రాప్ సామగ్రి పూర్తిగా దగ్ధమైపోయిందని అంటున్నారు. అలానే గోదాం బయట పార్క్ చేసిన జీప్, కారు కూడా పూర్తిగా కాలిపోయాయి.
బాణసంచా నిప్పురవ్వలే కారణమా?
స్థానికుల చెబుతున్న సమాచారం మేరకు.. సమీపంలో రాత్రంతా బాణసంచా కాల్చడం జరిగిందన్నారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోదాం యజమానిని, స్థానికులను విచారిస్తున్నారు. దీపావళి వంటి పండుగల్లో టపాసులు కాల్చేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ఖాళీ ప్రదేశాల్లో, దహన పదార్థాలు లేని ప్రాంగణాల్లో మాత్రమే టపాసులు కాల్చాలని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications