పోలీసుల విచారణలో మంచు మనోజ్ చెప్పింది ఇదే..!!
Mohan Babu: కుటుంబంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటోన్న ప్రముఖ నటుడు మంచు మనోజ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆయనను విచారించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సుమారు గంటన్నర పాటు ఈ విచారణ కొనసాగింది.
ఆయన తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనోజ్.. ఈ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అదే సమయంలో తనకు, తన భార్య మౌనిక రెడ్డి, ఏడు నెలల కుమార్తెకు భద్రత కల్పించే విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఆయా అంశాలతో పాటు పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మంచు మనోజ్ విచారణను ఎదుర్కొన్నారు. ఈ ఉదయం జల్‌పల్లిలోని మంచు టౌన్ షిప్ నుంచి కారులో నేరుగా రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలను పోలీసులు సంధించారు మనోజ్‌కు. ఆస్తి తగాదాలతో పాటు ఇదివరకు రాచకొండ కమిషనర్‌కు మోహన్ బాబు నేరుగా చేసిన ఫిర్యాదులో పొందుపరిచిన అంశాల.. ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలను మనోజ్‌ను అడిగి తెలుసుకున్నారని సమాచారం.
మనోజ్‌ను ఉద్దేశించి- మంగళవారం రాత్రి మోహన్ బాబు వ్యాఖ్యానించినట్లు భావిస్తోన్న ఆడియో క్లిప్‌లోని విషయాలు సైతం ఈ విచారణ సందర్భంగా పోలీసులు ఆరా తీశారని అంటున్నారు. పహాడీషరీఫ్ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలను ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంపైనా మనోజ్ నుంచి వివరణ తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ విచారణ ముగిసిన తరువాత తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు మంచు మనోజ్. తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. పోలీస్ వ్యవస్థపై అపార నమ్మకం ఉందని పేర్కొన్నారు. తామంతా కూర్చుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు.
ఈ గొడవలు, ఆస్తి తగాదాలు, ఘర్షణలు అన్న మంచు విష్ణు ప్రోద్బలంతోనే జరుగుతోందంటూ ఆరోపించారు మనోజ్. అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయిందన్నది అవాస్తవమని పేర్కొన్నారు. వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలకు పాల్పడుతున్నాడని, ఆ విషయాలేవి నాన్నకు తెలియవని చెప్పారు.
విద్యానికేతన్ సంస్థల్లో వినయ్ చేస్తోన్న అక్రమాల గురించి నాన్నకు చెప్పడానికి ప్రయత్నించానని, అవేవీ ఆయనకు తెలియనివ్వకుండా చేశారని మనోజ్ అన్నారు. తమ ఇంట్లో వినయ్ చిచ్చు పెట్టాడని ఆరోపించారు. ఇంట్లో గొడవకు గల కారణాలు తనకు తెలియవని, ఒకవేళ తెలిసినా చెప్పబోనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications