టిడిపికి మండవ దూరం: అన్నపూర్ణమ్మ కూడా..?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండవ వెంకటేశ్వర రావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడైన ఆయన పార్టీకి దూరంగా ఉండడంలోని ఆంతర్యం అర్థం కావడం లేదు. అరికెల నర్సిరెడ్డి మాత్రమే పార్టీ కోసం కాస్తా పనిచేస్తూ క్యాడర్‌కు అందుబాటులో ఉంటున్నారు.
మండవ వెంకటేశ్వర రావు నాలుగు సార్లు నిజమాబాద్ డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే, గత ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో చాలా కాలం నుంచి ఆయన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదని అంటున్నారు. జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా ఆయన పెద్దగా వెళ్లడం లేదని అంటున్నారు.

అన్నపూర్ణమ్మ కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. గతంలో నిజమాబాద్ జిల్లాలోని 9 సీట్లకు తొమ్మిది సీట్లను గెలుచుకున్న ఘనత టిడిపిది. కానీ ఇప్పుడు దిక్కులేకుండా పోయిందనే మాట వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాకే చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరారు. ఆయన ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నిజమాబాద్ జిల్లాలో అరికె నర్సిరెడ్డి తప్ప మరొకరు లేకుండా పోయారనే మాట వినిపిస్తోంది. తీవ్రమైన కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి మండవ వెంకటేశ్వర రావు దూరంగా ఉండడం మరింత కష్టాలను తెచ్చి పెట్టేదే. వెంకటేశ్వర రావు రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications