దారి సమస్య: కెసిఆర్ ప్రయత్నాలు, దొరకని కేంద్రమంత్రి పారికర్
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దాదాపు పదిహేను రోజుల క్రితం చేసిన విజ్ఞప్తికి కేంద్రమంత్రి మనోహర్ పారికర్ నుంచి ఇంకా సమాధానం రాలేదని తెలుస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రికి తెలంగాణ సీఎం నవంబర్ 12వ తారీఖున ఓ లేఖ రాశారు.
హైదరాబాద్ నగరంలోని ఏవోసీ నుంచి గఫ్‌రోడ్ వరకు ఉన్న రహదారిని మూసేయద్దని కోరారు. రహదారిని మూసివేస్తే స్థానికులు ఇబ్బందులు పడతారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఈ రహదారిని తెరిచే ఉంచాలని ఆయనను కెసిఆర్ కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే వరకు ఆర్మీ దాని విషయంలో ముందుకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విషయమై కేంద్రమంత్రి నుంచి ఇంకా జవాబు రాలేదని తెలుస్తోంది.

అదే సమయంలో ఈ విషయమై కెసిఆర్ రక్షణ శాఖ మంత్రితో మాట్లాడాలని చూస్తున్నారని, రెండు నెలలుగా కుదరడం లేదని తెలుస్తోంది. గతంలో ఢిల్లీ వెళ్లినప్పుడు కెసిఆర్ రక్షణ శాఖ మంత్రిని కలవాలని ప్రయత్నించారని, కానీ ఆయన అఫ్పుడు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని తెలిపారు.
ఇటీవల మనోహర్ పారికర్ హైదరాబాద్ వచ్చారని, అప్పుడు కూడా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదని చెబుతున్నారు. కాగా, డిసెంబర్ 1వ తేదీ ఏవోసీ నుంచి గఫ్ రోడ్డును మూసివేయనున్నట్లు ఆర్మీ తెలిపింది.












Click it and Unblock the Notifications