మావోయిస్ట్ నేత హరిభూషణ్ భార్య శారదకు కరోనా .. తీవ్ర అస్వస్థత ? మావోయిస్ట్ పార్టీలో కల్లోలం
కరోనా మహమ్మారి నగరాలు, పట్టణాలు, గ్రామాలనే కాదు అడవులను సైతం వదలడం లేదు. అడవుల్లో ఉన్న అన్నలను సైతం పట్టిపీడిస్తోంది. దండకారణ్యంలో ఉన్న మావోయిస్టు పార్టీకి తీరని నష్టం చేస్తోంది కరోనా. ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేత పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అలియాస్ హరి భూషణ్ కరోనా మహమ్మారికి బలైపోయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన సతీమణి శారద కూడా కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైన ట్లుగా సమాచారం.
మావోయిస్ట్ నేత యాప నారాయణ అలియాస్ హరి భూషణ్ సతీమణి శారద మావోయిస్టు పార్టీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలుగా పని చేస్తున్నారు. గతంలో మావోయిస్టు పార్టీలోని చర్ల ,శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారద కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. ఇటీవల కరోనా మహమ్మారితో తన భర్త హరిభూషణ్ మృతిచెందడం ఆమెను బాగా కుంగదీసింది. ఇదే సమయంలో ఆమె కూడా కరోనా బారిన పడడంతో ప్రస్తుతం తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్లు సమాచారం.

ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ మావోయిస్టు పార్టీ సభ్యులు కరోనాతో బాధపడుతున్నారని వెల్లడించిన జాబితాలో శారద కూడా ఉన్నారు. లొంగిపోతే వైద్యం చేయిస్తామని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పార్టీలో పరిస్థితి కరోనాతో గందరగోళంగా తయారైంది. ఎవరికైనా కరోనా సోకింది అన్న అనుమానం వస్తే, కొంచెం అనారోగ్యంతో ఉన్నప్పటికీ వాళ్ల దగ్గరికి ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడడం లేదని, కరోనా మహమ్మారికి జంకుతున్నారు అని సమాచారం. ఇక అసలే వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్న సమయంలో కరోనా మహమ్మారి మావోయిస్టు పార్టీని కుదేలు చేస్తుందని చెప్పటం అతిశయోక్తి కాదు.












Click it and Unblock the Notifications