మియాపూర్ నుండి కేపీహెచ్‌బీ వరకు మెట్రో టెస్ట్ రన్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని చేరుకుంది. రాజధానిలోని మియాపూర్ నుండి ఎస్సార్ నగర్ స్టేజ్-2లో మెట్రో టెస్ట్ రన్ గురువారం ప్రారంభమైంది. మియాపూర్ డిపో నుండి బయలుదేరిన మెట్రో రైలు కేపీహెచ్‌బీ వరకు 4.4 కిలోమీటర్ల ప్రయాణించింది. ఆ వెంటనే డిపోకు తిరిగి వెళ్లింది. మధ్యాహ్నం తొలిసారిగా ఆకాశమార్గంలో వయాడక్ట్ పైన మూడు కార్లతో వెళ్తున్న రైలును చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇకముందు ప్రతిరోజు పరీక్ష (టెస్ట్ రన్) పరుగు నిర్వహించనున్నారు. అనంతరం ప్రయోగాత్మక పరుగు (ట్రయల్ రన్) నిర్వహిస్తారు. ఈ మార్గంలో 14 రైళ్లను పట్టాల పైన పరీక్ష పరుగు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మియాపూర్ నుండి కేపీహెచ్‌బీ వరకే నిర్వహిస్తున్నారు. మూసాపేటలో విద్యుత్తు పనులు పూర్తయితే క్రమంగా ఎస్సార్ నగర్ వరకు ఈ పరుగును పొడిగిస్తున్నారు.
వాస్తవానికి గత నెలాఖరులోనే ఇది ప్రారంభం కావాల్సి ఉంది. ఎలక్ట్రికల్ పనులు పూర్తి కావడంతో ఈ నెల 5న ఈఐజీ అనుమతిచ్చింది. 6వ తేదీ నుండి మార్గాన్ని ఎల్ అండ్ టీ ఛార్జ్ చేసింది. మియాపూర్ డిపోలో గురువారం పూజల అనంతరం ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్ పరీక్ష పరుగును ప్రారంభించారు. అందరూ తొలి టెస్ట్ రన్ పైన సంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా, నాగోల్ నుండి మెట్టుగూడ వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర ఇప్పటికే పరీక్ష పరుగు పూర్తి చేసుకున్న మెట్రో రైలు ప్రయోగాత్మక పరుగును కొనసాగిస్తోంది. రెండో కారిడార్లో మియాపూర్ మార్గంలో తాజాగా టెస్ట్ రన్ ప్రారంభమైంది. ఇది వరకు నిర్ధేశించుకున్న నిర్మాణ షెడ్యూల్ ప్రకారం ఈ మార్గంలో పరీక్ష, ప్రయోగాత్మక పరుగులు పూర్తి చేసి ఆగస్టు 15కు ప్రారంభించాలని భావిస్తున్నారు.
ఎల్ అండ్ టీ మెట్రో రైలు సీఈవో అండ్ ఎండీ వీబీ గాడ్గిల్ మాట్లాడుతూ టెస్ట్ రన్‌లో భాగంగా 14 రైళ్లను ఈ మార్గంలో పలుమార్లు నడిపి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఫ్లై ఓవర్‌పై నుంచి నిర్మిస్తున్న మెట్రో మార్గం కూడా శరవేగంతో పూర్తవుతోంది.












Click it and Unblock the Notifications