
దద్దమ్మ.. సన్నాసి బండి సంజయ్.. నోరు అదుపులో పెట్టుకో: మునుగోడులో మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం సాగిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. బండి సంజయ్ మునుగోడులో ప్రచారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. బండి సంజయ్ ఓ దద్దమ్మ, సన్నాసి అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు.

బీజేపీ చేసిన అభివృద్ధిని చూపించాలి : మంత్రి ఎర్రబెల్లి
గతంలో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన నాగార్జునసాగర్ లో, హుజుర్ నగర్ లో ఊహకందని విధంగా అభివృద్ధి చేశామని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బిజెపి నాయకులు కావాలంటే అక్కడికి వెళ్లి చూడాలని హితవు పలికారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో, దుబ్బాక , హుజురాబాద్ లలో మాయ మాటలు చెప్పి, బీజేపి పార్టీ ప్రజలను మోసం చేసిందని, గెలిచిన తర్వాత అభివృద్ధి ఊసే లేదని మంత్రి ఎర్రబెల్లి టార్గెట్ చేశారు.

ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదు
చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అని గతంలో మంత్రిగా ఉన్నప్పుడు జేపీ నడ్డా హామీ ఇచ్చి వెన్ను చూపారని, కానీ కేసీఆర్ ఫ్లోరైడ్ ను రూపు మాపారు అని పేర్కొన్నారు. మునుగోడుకు ఏం చేశారని బీజేపీ వాళ్లకు ఓటేయాలని ప్రశ్నించిన మంత్రి ఎర్రబెల్లి, అసలు ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీ వాళ్లకు లేదన్నారు. టిఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతున్నాం అని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

మునుగోడు ప్రజలు బీజేపీని వంద అడుగుల లోతులో పాతిపెడతారు
బీజేపీ వాళ్ళు రెచ్చగొట్టి, డబ్బు మదంతో మునుగోడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులని, బిజెపిని వంద అడుగుల లోతులో పాతిపెడతారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. కెసిఆర్ జోలికి వస్తే మాడి మసై పోతారని ఎర్రబెల్లి శాపనార్థాలు పెట్టారు. గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ కు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. ఇక అది నిజం కాకపోతే లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

కేసీఆర్ ను చూస్తే బీజేపీ నేతల వెన్నులో వణుకు
మునుగోడు ఉప ఎన్నికల్లో కొంతమంది ఓట్లు గల్లంతు కావడంపై కలెక్టర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి. బిజెపి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ను బెదిరిస్తోంది అని, చెక్ పోస్టుల వద్ద అధికారులు తమ వాహనాలను మాత్రమే ఆపి తనిఖీ చేస్తున్నారు అని ఎర్రబెల్లి ఆరోపించారు. మునుగోడు ప్రజలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కెసిఆర్ ని చూసి బీజేపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని, కెసిఆర్ నిలువరించడానికి చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. బిజెపి నాయకులు ఎంత చేసిన కేసీఆర్ ను నిలువరించలేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.