తెలంగాణాపై కేంద్రానిది వివక్ష; బండి సంజయ్ దమ్ముంటే ఆ పని చెయ్.. మంత్రి హరీష్ రావు సవాల్
తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నేతలపై, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై తెలంగాణ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని పదేపదే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. శనివారం ఖమ్మం జిల్లాలో మంత్రి హరీష్ రావు రెండో రోజు పర్యటన నేపథ్యంలో ఆయన కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దొరగారికి అమ్ముకోవడం మీదున్న శ్రద్ధ పేదలకు ఇళ్ళు కట్టించడంలో లేదు: వైఎస్ షర్మిల చురకలు

తెలంగాణాపై కావాలని కేంద్రం వివక్ష చూపుతోంది
సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన హరీష్ రావు ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించడం కోసం, వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు. ఇక ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ మాత్రం సహాయం చేయడం లేదంటూ నిప్పులు చెరిగారు. కావాలని కేంద్రం వివక్ష చూపుతున్న చూపుతోంది అంటూ మంత్రి హరీష్ రావు ఆరోపణలు గుప్పించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిలియన్ మార్చ్ గల్లీలో చేయడం కాదని, దమ్ముంటే ఢిల్లీలో చేయాలంటూ సవాల్ విసిరారు.

తెలంగాణ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుంటే రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఏం చేస్తున్నారో చెప్పాలంటూ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలు విధానాలను మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

తెలంగాణా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది
ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రతి జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం, ఐ సి యూ వార్డులు తీసుకొచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. తలసేమియా వ్యాధి గ్రస్తులు సమస్య పరిష్కారం కోసం కూడా తాము కృషి చేస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆసుపత్రులు నిర్మిస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

తెలంగాణలో అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి పథకం కింద చేయూతనిస్తున్నాం అని , కళ్యాణ లక్ష్మి పథకం కింద 10 లక్షల మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం చేశామని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నారు అని మంత్రి హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణాపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తుందని ఆగ్రహం
ఇటీవల కాలంలో బీజేపీ నేతలపై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై గులాబీ నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే ఉన్నారు. తెలంగాణాపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తుందని మండిపడుతున్నారు. ఇక నిన్న ఖమ్మం ఆస్పత్రిలో క్యాత్ ల్యాబ్, ట్రామా కేర్ సెంటర్ లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు వ్యాక్సిన్ నిల్వలు ఉన్నా కేంద్రం రాష్ట్రానికి ఇవ్వటం లేదని ఆరోపణలు గుప్పించారు. కేంద్రం రాష్ట్రం చేస్తున్న సూచనలను పట్టించుకోవటం లేదన్నారు.