తనపై జరిగిన దాడి రేవంత్ రెడ్డి కుట్రే.. మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల సింహగర్జన బహిరంగసభలో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసిన నిరసనకారులు, ఆయన కాన్వాయ్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో నిర్వహించిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఆయన ప్రసంగాలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

రెడ్ల సింహ గర్జనలో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు .. మంత్రికి నిరసన సెగ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉందని, తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని, మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అధికారాన్ని చేజిక్కించుకుని ముఖ్యమంత్రి అవుతారని మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. కెసిఆర్ ను ఓ రేంజిలో పొగుడుతున్న మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై ఒక్కసారిగా సభలో ఉన్న వారి నుండి వ్యతిరేక నినాదాలు మిన్నుముట్టాయి.
దీంతో ఆయన తన ప్రసంగాన్ని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లి పోతున్న క్రమంలో ఆయన కాన్వాయ్ పై నిరసనకారులు చెప్పులు, రాళ్లు, కుర్చీలు విసిరేశారు. పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. పోలీసులు మల్లారెడ్డిని నిరసనకారుల నుండి తప్పించి సురక్షితంగా బయటకు పంపించారు.

తనపై జరిగిన దాడి రేవంత్ రెడ్డి కుట్ర అంటున్న మల్లారెడ్డి
ఇక ఈ ఘటనపై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్ర అంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నాను అన్న అక్కసుతోనే తన అనుచరులను సభకు పంపించి దాడి చేయించాడంటూ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక ఇలాంటి చర్యలకు తాను భయపడేది లేదని మంత్రి మల్లారెడ్డి తేల్చిచెప్పారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నాం అంటూ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

రెడ్డి కార్పోరేషన్ జాప్యంపై చెప్తున్న క్రమంలోనే నిరసన.. చేయించింది రేవంత్ రెడ్డి: మంత్రి మల్లారెడ్డి
టిఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే కరోనా మహమ్మారి కారణంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆలస్యం అయిందని తాను వివరిస్తున్న సమయంలోనే నినాదాలు చేస్తూ దాడికి ప్రయత్నించారు అంటూ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. తనపై దాడి కుట్రకు తెరతీసింది రేవంత్ రెడ్డి అంటూ మరోమారు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేశారు మంత్రి మల్లారెడ్డి. మరి మల్లారెడ్డి చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి ఏం సమాధానం ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications