గిరిజనులపై బిజెపిది కపట ప్రేమ; బండి సంజయ్ కు మంత్రి సత్యవతి రాథోడ్ సవాల్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం నాడు 12 ఎస్టీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించిన బండి సంజయ్ గిరిజనుల నియోజకవర్గాలలో రానున్న ఎన్నికల్లో బిజెపి విజయం సాధించేలా ప్రణాళికలు రచించాలని సూచించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కెసిఆర్ పోడు రైతులను మోసం చేశారని, పోడు రైతుల పక్షాన బిజెపి పోరాటం చేస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 19 ఎస్సీ నియోజకవర్గాలపై, 12 ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ చెయ్యాలన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

గిరిజనుల పై బిజెపిది కపట ప్రేమ
ఈ క్రమంలో బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజనులపై బిజెపిది కపట ప్రేమ అని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. బిజెపి గిరిజనుల కోసం ఏం చేసిందో చెప్పాలని బండి సంజయ్ కు సత్యవతి రాథోడ్ సవాల్ విసిరారు. దళితుల కోసం కూడా బీజేపీ ఏం చేసిందో చెప్పాలంటూ బండి సంజయ్ ను ప్రశ్నించారు.

బీజేపీ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారు
ఎస్సీ, ఎస్టీలను ఓటు అడిగే నైతిక హక్కు బిజెపికి లేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బీజేపీ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి పాలనతో తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు, దళితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సత్యవతి రాథోడ్ ఆరోపించారు. గిరిజనుల పట్ల బీజేపీకి ప్రేమ ఉంటే రిజర్వేషన్లు ఎందుకు పెంచటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజయ్ పోడు భూముల పై పోరాటం చేస్తానని చెబుతున్నారని, అయితే అటవీ చట్టాలన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయనేది బండి సంజయ్ తెలుసుకోవాలని హితవు పలికారు.

ములుగులో గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు
పోడు భూముల పై మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే సీఎం కేసీఆర్ కు నివేదిక అందించిందని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఇస్తామని కేంద్రం ఇప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలలో గిరిజన యూనివర్సిటీలు ఇచ్చి తెలంగాణా రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా బీజేపీ నేతలపై, బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ కు అనేక పశ్నాస్త్రాలు సంధించారు.

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించలేని దద్దమ్మలు
ఎస్సీలను, ఎస్టీలను మోసం చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అని మండిపడ్డారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని దద్దమ్మలు బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. దేశవ్యాప్తంగా బీజేపీ పాలనలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అబద్ధాల బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని కలలుకంటూ ఉందని, వారి కలలు కల్లలేనని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ మాటల దాడి చేస్తున్నారు.