ఎమ్మెల్సీ కవితకు మంత్రి తలసాని సంఘీభావం.. మేం దాడులు చేస్తే తట్టుకోలేరంటూ బీజేపీకి వార్నింగ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు ప్రమేయం ఉందని బీజేపీ చేసిన ఆరోపణలతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించడానికి బీజేపీ శ్రేణులు ప్రయత్నం చేస్తూ, పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడితే, కవితకు మద్దతు తెలుపుతూ టిఆర్ఎస్ నాయకులు కవిత ఇంటికి చేరుకున్నారు. ఆమెకి తమ సంఘీభావాన్ని ప్రకటించి బిజెపి సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నారు.
ఎమ్మెల్సీ కవితకు సంఘీభావం తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇక తాజాగా ఎమ్మెల్సీ కవిత ను కలిసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బిజెపి నేతల పై ఫైర్ అయ్యారు. టిఆర్ఎస్ సైన్యం ఎంత మంది ఉన్నారో తెలుసా, మేమంతా కలిసి దాడి చేస్తే తట్టుకోలేరు అంటూ బీజేపీ నేతలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపై దాడికి పాల్పడడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఇలా ఇళ్ళమీద దాడులకు రావడం దుర్మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
మీ ఇళ్ళ మీద దాడులకు రావాలంటే పెద్ద విషయం కాదు.. బీజేపీ నేతలపై ఆగ్రహం
ఇది హేయమైన చర్య అని పేర్కొన్న తలసాని ఇళ్ళ మీదకు దాడికి రావాలంటే పెద్ద విషయం కాదు అంటూ పేర్కొన్నారు. అసలు కవిత ఇల్లు ముట్టడించడానికి కారణం ఏమిటో మీకు తెలుసా? కనీసం ఆ అంశంపై మీకు అవగాహన ఉందా? అని ప్రశ్నించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన మాటలను, తప్పుడు ఆరోపణలను పట్టుకొని బాధ్యత గల వ్యక్తి ఇంటి మీదికి దాడికి రావడం సమంజసం కాదంటూ మండిపడ్డారు.
మేం కూడా ఆపని చెయ్యాలా.. హెచ్చరించిన మంత్రి తలసాని
టిఆర్ఎస్ పార్టీకి వేలాదిమంది సైన్యం ఉందని, మీ ఇళ్ల మీద, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తే మీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక సంఘీభావం చెప్పడానికి వచ్చిన కార్యకర్తలు బీజేపీ కార్యాలయాల ముట్టడికి వెళతామని చెబుతున్నారని, పంపించమంటారా అంటూ హెచ్చరించారు. తమకు సంస్కారం ఉందని, తమ అధినేత తమకు దాడులు చేయించడం నేర్పించలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇక బీజేపీ నేతలు చేస్తున్న ముట్టడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
కవితకు సంఘీభావం తెలుపుతున్న టీఆర్ఎస్ నేతలు
ఇక తాజాగా బిజెపి ఆందోళనల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, హైదరాబాద్ కార్పొరేటర్లు ఒక్కొక్కరు ఆమెకు సంఘీభావంగా కవిత ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications