గురుకులంలో దారుణం! పుస్తకాలు పట్టాల్సిన చేతులతో చపాతీలు..
విద్యాబుద్ధులు నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుకుల విద్యాలయం దారి తప్పింది! సమాజంలో గొప్ప స్థాయిలో నిలబడతారనే నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గురుకులంలో చేర్పిస్తే.. అక్కడ జరుగుతున్న దారుణం చూసి యావత్ సమాజం ముక్కున వేలేసుకుంటోంది. అక్షరాలు దిద్దాల్సిన ఆ చేతులతో బలవంతంగా చపాతీలు చేయిస్తున్నారు. విద్యాబోధన చేయాల్సిన గురువులే దగ్గరుండి విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని గురుకుల మోడల్ పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థులు చేత వంట పనులు, చపాతీలు చేయిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో సేకరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, గురుకుల నిర్వహణపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైరల్ వీడియోలతో బయటపడ్డ అసలు నిజాలు!
పాఠశాలలో విద్యార్థులు చపాతీలు చేస్తూ, ఇతర పనుల్లో నిమగ్నమైన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపిస్తున్నాయి. పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థుల చేతులకు వంటపాత్రలు అప్పగించడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం, బాధ్యతారాహిత్యమే ఈ పరిస్థితికి కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురుకుల మోడల్ పాఠశాలల్లో విద్యాబోధన ఏవిధంగా సాగుతోందో, నిబంధనలు ఏ మేరకు అమలు జరుగుతున్నాయో అధికారులు పట్టించుకోవడమే లేదని విమర్శిస్తున్నాయి. ఉన్నతాధికారులు గురుకులాల పర్యవేక్షణపై సీతకన్ను వేయడం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపిస్తూ ఆందోళనకు దిగాయి.
పూర్తిస్థాయి విచారణకు డిమాండ్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి బాధ్యులైన ప్రిన్సిపాల్, సంబంధిత ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి గురుకులాల్లో విద్యా వాతావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు.














Click it and Unblock the Notifications