గాడిదకు నర్సింగ్ సర్టిఫికెట్.. వైద్య విద్యలో సంచలనం
గాడిద గుడ్డు పెట్టింది అనే సామెత ఎంత నిజమో.. గాడిద నర్సింగ్ కోర్స్ పూర్తి చేసింది అనేది కూడా అంతే నిజం. ఎందుకంటే అధికారులు ఎంతటి హైటెక్ విధానాలు తెచ్చినా, ఆన్‌లైన్ వ్యవస్థలో ఉండే లోపాలు ఎప్పుడూ ఎంతోకొంత విస్మయానికి గురిచేస్తుంటాయి. సరిగ్గా అలాంటి లోపాలను కళ్లకు కట్టేలా మధ్యప్రదేశ్ నర్సెస్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ పనితీరుపై ఒక వినూత్న ప్రయోగం జరిగింది. వైద్య విద్య వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన రంగంలో అధికారుల పరిశీలన ఎంత లోపభూయిష్టంగా ఉందో నిరూపించేందుకు ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి పర్మార్ చేపట్టిన సాహసోపేతమైన చర్య ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకంగా ఒక జంతువు పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ ఒక్కసారిగా ఖంగుతింది.
ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన ఎంత నామమాత్రంగా సాగుతోందో బట్టబయలు చేసేందుకు రవి పర్మార్ ఒక గాడిద పేరుతో నర్సింగ్ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేశారు. ఆ విచిత్ర దరఖాస్తులో దరఖాస్తుదారు పేరు స్థానంలో 'గాడిద', తండ్రి పేరు 'గాడిద తండ్రి', కులం 'జంతువు', మతం 'ఇతరులు' అని స్పష్టంగా నమోదు చేశారు. అంతేకాకుండా చిరునామా స్థానంలో 'ఖాళీగా ఉన్న చోటల్లా' అని రాసి, ప్రొఫైల్ ఫోటో కింద ఒక గాడిద బొమ్మను అప్‌లోడ్ చేశారు. నిర్దేశిత ఫీజు రూ.250.. చెల్లించగానే ఆటోమేటెడ్ ఆన్‌లైన్ సిస్టమ్ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా దరఖాస్తును ఆమోదించింది. భోపాల్ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ శిక్షణ పూర్తి చేసినట్లు పేర్కొంటూ కౌన్సిల్ ఏకంగా సెప్టెంబర్ 25న డిజిటల్ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేసింది.

వైద్య రంగంలోకి నకిలీల ముప్పుపై తీవ్ర ఆందోళన
ఈ నకిలీ దరఖాస్తును ఏమాత్రం తనిఖీ చేయకుండానే కౌన్సిల్ 'రిజిస్టర్డ్ నర్స్ అండ్ రిజిస్టర్డ్ మిడ్‌వైఫ్' హోదా కల్పిస్తూ సెప్టెంబర్ 2031 వరకు వాలిడిటీ ఉన్న సర్టిఫికెట్‌ను జారీ చేయడం విశేషం. అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించకుండా కేవలం ఆన్‌లైన్ ఆటోమేషన్ పైనే ఆధారపడితే ఆరోగ్య రంగంలోకి అనర్హులు ఎంత సులభంగా చొరబడగలరనే భయాలను ఈ ఘటన రేకెత్తించింది. నిజమైన అభ్యర్థుల అర్హతలను కనీసం వెరిఫై చేయకుండా ఇలాంటి తప్పులు జరగడం పట్ల నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రక్షాళన చర్యలకు ఉపక్రమించిన కౌన్సిల్ అధికారులు
ఈ సంచలన ఘటన వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడిన మధ్యప్రదేశ్ నర్సెస్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇది కేవలం తాత్కాలిక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ మాత్రమేనని, తప్పుడు పత్రాలు లేదా ఫోటోలు గుర్తిస్తే వాటిని రద్దు చేసే వెసులుబాటు ఉందని కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ బీను కుష్వాహా స్పష్టం చేశారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ ఆన్‌లైన్ విధానాన్ని తెచ్చినట్లు ఆమె తెలిపారు. ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా డిజిలాకర్ అనుసంధానంతో పాటు మరింత కఠిన భద్రతా నిబంధనలను తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ సమాచారాన్ని సమర్పించి వ్యవస్థను తప్పుదోవ పట్టించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.














Click it and Unblock the Notifications
