బాలయ్య - రవితేజ కాంబోలో మిస్ అయిన చిత్రం
టాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో రవితేజ ముందు వరుసలో ఉంటారు. చిన్న చిన్న పాత్రలు, నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేస్తూ వచ్చి.. ఆ తర్వాత 'నీ కోసం' చిత్రంతో హీరోగా టర్న్ తీసుకున్నారు. 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'ఇడియట్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇటీవలే 'ఇరుముడి' సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు.
బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు
అయితే కెరీర్ తొలినాళ్లలో రవితేజ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. నాగార్జున, చిరంజీవి, జగపతిబాబు వంటి హీరోల చిత్రాల్లో కనిపించారు. కానీ టాలీవుడ్ మరో మాస్ ఇమేజ్ హీరో అయిన బాలకృష్ణతో మాత్రం ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే, కెరీర్ ఆరంభంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అది మిస్ అయింది.

అసలు ఆ సినిమా ఏంటంటే.. బాలయ్య హీరోగా, విజయశాంతి హీరోయిన్‌గా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'నిప్పురవ్వ'. ఈ మూవీలో హీరో చెల్లిని పెళ్లి చేసుకునే ఒక కీలకమైన, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర (రాజా రవీంద్ర చేసిన రోల్) ఉంది. ఈ పాత్ర కోసం మేకర్స్ నిర్వహించిన ఆడిషన్స్‌కు రవితేజ కూడా వెళ్లారు. అక్కడ తన నటనతో మెప్పించి ఆ రోల్‌కు సెలెక్ట్ కూడా అయ్యారు.
పరుచూరి బ్రదర్స్ వల్ల మిస్
అయితే ఆ సమయంలో రవితేజకు రావాల్సిన ఆ అవకాశం కాస్తా.. పరుచూరి బ్రదర్స్ రికమండేషన్ కారణంగా రాజా రవీంద్ర చేతికి వెళ్లింది. అలా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోవడం, రికమండేషన్ల హవా కారణంగా రవితేజకు బాలయ్యతో నటించే ఆ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా రవితేజనే బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన ప్రముఖ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' లో బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ విషయానికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, భారీ అంచనాల మధ్య విడుదలైన 'నిప్పురవ్వ' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఒకవేళ ఆ పాత్రలో రవితేజ నటించి ఉంటే ఆయన కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేదేమోనని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.














Click it and Unblock the Notifications
