తెలంగాణ కట్టు-బొట్టులో మురిసిన మిస్ వరల్డ్
Miss World 2025: మిస్ వరల్డ్ 2025కు ఆతిథ్యాన్ని ఇస్తోంది తెలంగాణ. హైదరాబాద్ దీనికి వేదిక. భారత్ సహా 109 దేశాలకు చెందిన సుందరీమణులు ప్రస్తుతం.. తెలంగాణలో వివిధ నగరాల్లో పర్యటిస్తోన్నారు. ఇక్కడి సాంస్క్రతిక, వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెబుతున్నారు.
ఇదివరకు పాతబస్తీలో పర్యటించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో సందడి చేశారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్.. ఈ విందుకు వేదిక అయింది. 109 దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు, ప్రతినిధులతో చౌమొహల్లా ప్యాలెస్ మెరిసిపోయింది.

రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పాతబస్తీలో నిజాం కాలం నాటి వస్తువులు, సైనిక సామగ్రిని తిలకించడానికి, వాటి విశిష్టత గురించి తెలుసుకోవడానికి ప్రపంచ సుందరీమణులు ఎంతో ఆసక్తి చూపారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలు తమనెంతో ఆకర్షించాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ సీఈవో జూలియా మోర్లే తెలిపారు.
ఇప్పుడు తాజాగా 22 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఐకానిక్ ఖిలా వరంగల్‌ను సందర్శించారు. అందాల భామలకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ సాదరంగా ఆహ్వానం పలికారు. వారి కోసం వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాకతీయ రాజవంశ ఘన చరిత్రను చాటిచెప్పేలా సాగిందీ ప్రోగ్రామ్. శిలా తోరణం, వెయ్యి స్తంభాల ఆలయం, వరంగల్ ఫోర్ట్ గురించి వివరిస్తూ రూపొందించిన మెమెంటోలు, బ్రోచర్లను మంత్రి కొండా సురేఖ వారికి అందజేశారు. అంతకుముందు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఫ్లీ మార్కెట్‌ను సందర్శించారు. ఇందులో పాల్గొన్న 22 మంది కంటెస్టెంట్లు.. తెలంగాణ చీరకట్టు- బొట్టులో మెరిసిపోయారు.
తెలంగాణకు గర్వకారణమైన కళంకారి తివాచీలు, జీఐ- ట్యాగ్ సాధించిన చౌపాటి మిర్చి, పాకాల పసుపు గురించిప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పేరిణి శివతాండవం, రుద్రమ దేవి నృత్య రూపకం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు వారిని మంత్ర ముగ్ధులను చేశాయి.
సౌండ్ అండ్ లైట్ షో.. వరంగల్ చారిత్రక వైభవాన్ని కళ్లకు కట్టినట్టు తెలియజేసింది. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
మేయర్ సుధారాణి, ఇతర ప్రముఖులు సందర్శకులకు సావనీర్లను అందజేశారు. ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వారికి వివరించారు.












Click it and Unblock the Notifications