నేనేవరో తెల్వదా! నీ సంగతేందో చూస్తా!:ఎస్సైతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాగ్వాదం
'నీ సంగతేంటో చూస్తా..' అంటూ తమను ఎమ్మెల్యే బెదిరించినట్టుగా పోలీస్ సిబ్బంది చెబుతున్నారు.
కామారెడ్డి: బుధవారం సాయంత్రం కామారెడ్డి పట్టణంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ట్రిపుల్ రైడింగ్ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దమంటూ స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులను పోలీసులు అడ్డుకోవడంతో.. ఏకంగా ఎమ్మెల్యేనే రంగంలో దిగి పోలీసులతో గొడవపడ్డారు.
'అధికార పార్టీ ఎమ్మెల్యేను నేను.. నేనే తెలియదా? నా పేరు చెప్పినా నా మనుషులను వదిలిపెట్టావా? నీ సంగతి తేలుస్తా' అంటూ విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్సైతో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. బుధవారం నాడు సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్సై.. ట్రిపుల్ రైడింగ్ తో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్నారు. ట్రిపుల్ రైడింగ్ నిబంధనలకు విరుద్దం కాబట్టి జరిమానా చెల్లించాల్సిందేనని ఎస్సై అన్నారు. దీంతో తాము ఎమ్మెల్యే అనుచరులమని, జరిమానా లేకుండా వదిలేయాలని సదరు వ్యక్తులు ఎస్సైని డిమాండ్ చేశారు.
అయితే ఎస్సై అందుకు ససేమిరా అనడంతో.. ట్రిపుల్ రైడింగ్ లో పట్టుబడ్డ వ్యక్తులు ఎమ్మెల్యేకు ఫోన్ చేయడం.. ఆయన అక్కడ వాలిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. విషయం తెలుసుకోకుండానే ఎస్సై సహా సిబ్బందితోను ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది.
'నీ సంగతేంటో చూస్తా..' అంటూ తమను ఎమ్మెల్యే బెదిరించినట్టుగా పోలీస్ సిబ్బంది చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడికి యత్నించారని పోలీసులు చెప్పడం గమనార్హం.కాగా, ఎస్సీకి ఫోన్ చేసిన మాట్లాడిన ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి.. జరిమానా కట్టించకుండానే తన అనుచరులను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications