అయ్యప్పదీక్షలో ఉండి ప్రమాణం చేస్తున్నా.. భాగ్యలక్ష్మీ ఆలయానికి రా బండి సంజయ్: రోహిత్ రెడ్డి
టిఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి ఈడీ నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈడి నోటీసుల కంటే, బెంగళూరు డ్రగ్స్ కేసులో సంబంధం ఉందని, ఈ డి, సిబిఐ లు పైలెట్ రోహిత్ రెడ్డిని విచారించాలని రెండు రోజుల క్రితం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే పైలట్ రోహిత్ రెడ్డికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో బండి సంజయ్ ను టార్గెట్ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి పదేపదే బండి సంజయ్ కు చాలెంజ్ విసురుతున్నారు.

బండి సంజయ్ కు పైలట్ రోహిత్ రెడ్డి సవాల్
నిన్నటికి నిన్న యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని బండి సంజయ్ కి చాలెంజ్ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి, తనకు డ్రగ్స్ కేసులో ఎటువంటి సంబంధం లేదని తాను తడిబట్టలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి ముందు ప్రమాణం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.
ఇక తాజాగా నేడు భాగ్య లక్ష్మి అమ్మవారి ఆలయాన్ని వెళ్లి అమ్మవారిని దర్శించుకున్న పైలట్ రోహిత్ రెడ్డి అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ కు సవాల్ విసిరారు. బండి సంజయ్ తడిబట్టలతో రేపు భాగ్య లక్ష్మీ అమ్మవారి ఆలయానికి 10 గంటలకు రావాలని, వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
నాకు కర్ణాటక పోలీసుల నుండి నోటీసులు వస్తే చూపించాలన్న రోహిత్ రెడ్డి
తనకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చినట్లు బండి సంజయ్ చూపించాలన్నారు. బండి సంజయ్ కు తంబాకు నమలడం వల్ల నోరు తిరగడం లేదని పేర్కొన్నారు రోహిత్ రెడ్డి. బీజేపీకి అబద్దాలు చెప్పడం కామన్ గా మారిందంటూ వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని బిజెపి రాజకీయంగా వాడుకుంటోందని మండిపడిన ఆయన, నాకు కర్ణాటక పోలీసుల నుండి నోటీసులు వస్తే అమ్మవారి సాక్షిగా బీజేపీ నాయకులు చూపించాలంటూ సవాల్ విసిరారు.

భాగ్యలక్ష్మీ ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తావా?
బండి సంజయ్ నిజంగా హిందూవాది అయితే రేపు భాగ్య లక్ష్మీ అమ్మవారి ఆలయానికి ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. డ్రగ్స్ కేసులో ఎక్కడ ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప దీక్ష వేసుకుని నేను ప్రమాణం చేస్తున్నా.. నాకు కర్ణాటక నుండి ఎటువంటి నోటీసు రాలేదన్నారు. దమ్ముంటే బండి సంజయ్ వచ్చి ప్రమాణం చెయ్యాలన్నారు.

ముందే నోటీసులు వస్తాయని బండి సంజయ్ కు ఎలా తెలుసు?
నాకు సోమవారం ఈడి ఆఫీస్ కు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందని తన బయోడేటా కోసమే ఈడీ నోటీసు ఇచ్చిందని పేర్కొన్నారు పైలెట్ రోహిత్ రెడ్డి. భాగ్య లక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్ రాకపోతే ఇంతకు ముందు దొంగ స్వాములకు నీకు తేడా లేదని పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు.
ఇక ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు వస్తాయని బీజేపీ ముందే ఎలా చెప్పిందో చెప్పాలని పైలట్ రోహిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బండి సంజయ్ ను టార్గెట్ చేస్తున్న రోహిత్ రెడ్డి ఇదంతా కావాలని జరుగుతున్న కుట్ర అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయని అన్నారు. తాను తగ్గేది లేదని, ఎవరికీ భయపడేది లేదని పైలట్ రోహిత్ రెడ్డి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications