వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలో పోలింగ్ శాతం ఎంతంటే?
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 72.44 శాతం పోలింగ్ నమోదైందని మంగళవారం ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. నియోజకవర్గ వ్యాప్తంగా 4,63,839 ఓట్లకు గానూ.. 3,36,013 ఓట్లు పోలయ్యాయని రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు.
2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 76.35 నమోదు కాగా.. ఈసారి పోలింగ్ శాతం తగ్గడం గమనార్హం. జూన్ 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా, ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరపున రాకేశ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితోపాటు మరో 49 మంది పోటీలో నిలిచారు.

కాగా, పోలింగ్ ముగియడంతో వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ నియోజకవర్గ పట్టభద్రుల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది.
వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో, 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక జరిగింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతితక్కువగా సిద్దిపేటలో 5 కేంద్రాల్లో పోలింగ్ సాగింది.
ఎమ్మెల్సీ ఎన్నికలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండలో ఓటేయగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామలో, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తొర్రూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, నల్గొండలో కలెక్టర్ చందన, ఇతర అధికారులు ఓటు వేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, వరంగల్ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ఓటేశారు.












Click it and Unblock the Notifications