MLC Kavitha.. నెలరోజులుగా ఈడీ, సీబీఐ ఒత్తిడి, అయినా అదేమాట!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఓవైపు ఈడి నుండి మరోవైపు సిబీఐ నుండి విచారణను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం లో అరెస్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కవితకు బెయిల్ రాకపోగా ఈడీ, సిబిఐ విచారణల పేరుతో దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.
తన వాదన బలంగా వినిపిస్తున్న కవిత
ఒకపక్క న్యాయస్థానంలో పోరాటం చేస్తూనే మరోవైపు ఎమ్మెల్సీ కవిత తనపై పెట్టిన కేసు రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసని, గతంలో అడిగిన ప్రశ్నలను పదేపదే అడగడం తప్ప కొత్తగా ఇప్పుడు చేస్తుంది ఏమీ లేదని చెబుతున్నారు. న్యాయస్థానాల్లో వరుస షాకులు తగులుతున్నప్పటికీ ఎమ్మెల్సీ కవిత తన వాదన బలంగానే వినిపిస్తున్నారు.

ఇది సిబీఐ కస్టడీ కాదు బిజెపి కస్టడీ
తాజాగా సిబీఐ కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు కవితను ఢిల్లీలోని హౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరిచేందుకు వెళుతున్న క్రమంలో కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఇది సిబీఐ కస్టడీ కాదని బిజెపి కస్టడీ అని ఎమ్మెల్సీ కవిత కేంద్రంలోని బిజెపి పై విరుచుకుపడ్డారు. బయట బిజెపి వాళ్ళు మాట్లాడింది లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారని, వాళ్లకు కొత్తగా అడిగేందుకు ఏమీ లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
కవిత అరెస్ట్ అయ్యి నెలరోజులు .. అన్నీ ఇబ్బందులే
కోర్టు ఆవరణలో మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఆమె మాటలు మరోమారు రాజకీయ కోణంలోనే తనను అరెస్టు చేసినట్లుగా వ్యాఖ్యలు చేశారు. కోర్టు కవిత కస్టడీని పొడిగించినా, మార్చి 15వ తేదీన ఈడి అరెస్టు చేసిన నాటి నుంచి ఇప్పటివరకు కవిత ఈడి కస్టడీని, సిబీఐ కస్టడీని ఫేస్ చేయడంతో పాటు, తీహార్ జైల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కవిత స్వరంలో ఏం మార్పు లేదు
నెలరోజులుగా కవితను దర్యాప్తు సంస్థల ముప్పతిప్పలు పెడుతున్నా కవిత స్వరంలో ఏమాత్రం మార్పు లేదు. ఈడీ అధికారులు కస్టడీ నుంచి కోర్టుకు వెళ్లే సమయంలో తనపై పెట్టినది అక్రమ కేసని, కేవలం ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసని, అడిగిన ప్రశ్నలను అడుగుతున్నారని చెప్పిన కవిత మరోమారు, సిబిఐ అధికారుల కస్టడీ నుంచి కోర్టుకు వెళ్లే సమయంలో కూడా అదే విధంగా సంచలన ఆరోపణలు చేశారు. నెలరోజులుగా ఇబ్బందులు పెడుతున్నా కవిత స్వరంలో ఎలాంటి మార్పు లేదు.












Click it and Unblock the Notifications