ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర కు ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ
ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. రాజకీయ కోణంలో తనను విచారిస్తున్నారని, తన ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఈడీ లీక్ ఇవ్వటం అందుకేనని అన్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే ఈడి విచారణ దురుద్దేశ పూర్వకంగా జరుగుతుందని, రాజకీయ కోణంలో ఈడీ తనను విచారిస్తుందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కవిత ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు సంచలన లేఖ రాశారు.
ఈరోజు వరుసగా మూడో సారి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవిత అంతకు ముందు రాసిన లేఖలో ఈడీ అధికారులు తాను తన ఫోన్లను ధ్వంసం చేశానని ఆరోపణలు చేయడాన్ని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ఈడి అధికారులు దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ గతంలో తాను ఉపయోగించిన మొబైల్ ఫోన్లన్నింటిని ఈడీ ముందు సమర్పిస్తున్నానని కవిత లేఖలో పేర్కొన్నారు. ఒక మహిళ యొక్క ఫోను స్వాధీనం చేసుకోవడంపై లేఖలో ప్రస్తావించిన కవిత గోప్యతా హక్కుకు భంగం కలగదా అంటూ అంటూ ప్రశ్నించారు.

తనను తొలిసారి మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచిందని, కానీ గత ఏడాది నవంబర్లోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఆరోపించడం అంటే తనపై దురుద్దేశ పూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనని కవిత పేర్కొన్నారు. తన మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశానని దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ పేర్కొందని కవిత వెల్లడించారు. తనకు కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా, తనను అడగకుండా ఏ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల, ఉద్దేశపూర్వకంగా లీక్ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
దీనివల్ల తన ప్రతిష్టకు తీవ్రభంగం కలగడమే కాకుండా తన పరువును, తన పార్టీ పరువును ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని కవిత పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న తన కర్తవ్యాన్ని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications