పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లపై మోడీ ప్రభుత్వం ప్రశంసలు!
న్యూఢిల్లీ: మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక సందర్భంలో ప్రశంసలు కురిపించింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో పీవీ నరసింహారావుతోపాటు అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా కీలక భూమిక పోషించారని కొనియాడింది. 'లైసెన్స్ రాజ్' కు ముగింపు పలకడంతోపాటు ఆర్థిక సరళీకరణకు మార్గదర్శకులుగా నిలిచారని ప్రశంసించింది.
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు పేర్కొనడం గమనార్హం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లు 1991లో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎన్నో చట్టాలను సరళీకరించాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వెల్లడించారు. కంపెనీ చట్టం, వాణిజ్య పద్ధతుల చట్టం సహా ఎంఆర్టీపీ వంటి ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణను ఇవి దారితీసిందని.. 'లైసెన్స్ రాజ్' యుగానికి ముగింపు పలికేలా చేసిందని వివరించారు. ఆ తర్వాత మూడు దశాబ్దాల్లో వచ్చిన ప్రభుత్వాలు మాత్రం ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండ్ రెగ్యూలరేషన్ యాక్ట్ 1951ను సవరించడంపై దృష్టి సారించే అవకాశం రాలేదని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మసనానికి తెలిపారు.
ఐడీఆర్ఏ(IDRA)-1951 చట్టం 'లైసెన్స్ రాజ్' రోజులను ప్రతిబింబిస్తోందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం విమర్శించిన నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ ఈ మేరకు స్పందించారు. ఈ ఆర్థిక సంస్కరణ వల్ల మార్పులు వచ్చినప్పటికీ.. ఐడీఆర్ఏ మాత్రం అలాగే ఉండిపోయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాగా, కరోనావైరస్ మహమ్మారి వంటి పరిస్థితుల్లో దేశ ప్రయోజనాల దృష్ట్యా పరిశ్రమలను నియంత్రించే అధికారం కేంద్రం కలిగి ఉందని వివరించింది. అయితే, సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రధానిని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications