Rain alert: ఏపీ, తెలంగాణ జిల్లాల్లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులపాటు హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు, ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ సీజన్లో రుతుపవనాలు మరింత ఉధృతమై విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలివే
కాగా, ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని నిజాంబాద్‌లో 4.6 సెంటిమీటర్లు, సిద్దిపేట జిల్లాలోని కోహెడలో 4, కరీంనగర్ జిల్లాలోని అశ్వాపురంలో 3.6 సెంటిమీటర్ల వర్షం కురిసింది.
మరోవైపు, ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో అత్యధికంగా 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు.. మిగితా జిల్లాల్లోనూ
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.