భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగుదాటుతూ కొట్టుకుపోయిన తల్లీ కూతుళ్ళు; వీడియో వైరల్!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా జిల్లాలలో అత్యంత భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ష బీభత్సం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చిగురుటాకుల మాదిరిగా వణుకుతున్నారు. వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగకూడదని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్కడక్కడ ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంటూనే ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ములకలపల్లి మండలం, చాపరాలపల్లి వద్ద కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతు#TelanganaRains #Rains #TSRains #Oneindiatelugu pic.twitter.com/WJ08AZvngS
— oneindiatelugu (@oneindiatelugu) July 27, 2023
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్ళు పాములేరు వాగు దాటుతూ బ్యాలెన్స్ తప్పి వాగులో కొట్టుకుపోయారు. కూతురిని స్థానికులు కాపాడగా తల్లి ఆచూకీ ఇంకా లభించలేదు. నిన్న సుమారు 20 మంది మహిళల బృందం వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తూ వరద నీటిలో చిక్కుకున్నారు.
వరి నాట్లు వేసేందుకు వెళ్లి, వరి నాట్లు వేసిన అనంతరం తిరిగి ఇళ్లకు చేరుకునే క్రమంలో చాపరాల పల్లి వద్ద పాములేరు వాగులో లెవెల్ వంతెన ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనిని దాటటం కష్టం అని భావించి కాసేపు ఎదురు చూశారు. కానీ వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో ఎలాగోలా ఇంటికి చేరాలని ప్రయత్నం చేసిన వారంతా గుంపులుగా చేతులు పట్టుకుని వాగు దాటే ప్రయత్నం చేశారు.

అయితే ఉదృతంగా వాగు ప్రవహిస్తున్న క్రమంలో గుంపులోని తల్లి కూతుళ్లు ఇద్దరు వరదకు కొట్టుకుపోయారు. వాగులో పడి తల్లి కుంజ సీత, కురసం జ్యోతి లు వరద ఉధృతిలో కొట్టుకుపోగా సహచర కూలీలు వారిని రక్షించలేకపోయారు. మిగతావారంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వాగు దాటారు.
కాసేపటికి కుమార్తె జ్యోతి ఒక చెట్టు కొమ్మను పట్టుకొని ఉండగా స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. తల్లి సీత జాడ మాత్రం ఇంతవరకు దొరకలేదు. ఆమె కోసం గాలింపు చేపట్టారు. కళ్ళ ముందే కొట్టుకుపోయి ఆచూకీ లభించని తల్లి కోసం కూతురు జ్యోతి కన్నీరు మున్నీరుగా రోదిస్తుంది. ప్రస్తుతం రెస్క్యూ టీం ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications