అయ్యయ్యో.. దీపావళి పండుగ పూట నీకు ప్రాణమెలా ఒప్పింది తల్లీ!
దేశవ్యాప్తంగా అందరూ దీపావళి పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటుంటే, నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఒక వివాహిత, తన ఇద్దరు చిన్నారులను హతమార్చి తాను ప్రాణాలు తీసుకున్న ఘటన పండగపూట విషాదాన్ని మిగిల్చింది .వారి కుటుంబ సభ్యులకు తీరని శోకానికి కారణమైంది.
భార్యాభర్తల మధ్య గొడవలు
ఈ ఘటన వివరాలలోకి వెళితే నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల రమేష్, నాగలక్ష్మి దంపతులు గత నాలుగు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 9 సంవత్సరాల అవంతిక, ఏడు సంవత్సరాల భవన్ సాయి ఉన్నారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తలు ఇద్దరూ గొడవలు పడుతున్నారు.

ఇద్దరు పిల్లల్ని చంపి, ఆత్మహత్య చేసుకున్న తల్లి
కుటుంబ కలహాల కారణంగా నిన్న సాయంత్రం నుంచి భర్త రమేష్ కనిపించకుండా పోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భార్య నాగలక్ష్మి ఇద్దరు పిల్లలను చంపి, తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్త ల మధ్య కుటుంబంకలహాలు జరుగుతుండగా నిన్న సాయంత్రం నుంచి భర్త రమేష్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె దీపావళి పండుగ నాడు నేడు ఉదయం దారుణానికి ఒడిగట్టింది.
స్థానికంగా తీవ్ర విషాదం
నాగలక్ష్మి తన ఇద్దరు పిల్లల గొంతు నమిలి చంపి తను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండగ రోజు ఒకే కుటుంబం లోని ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
తల్లి తొందరపాటు నిర్ణయం
ఏది ఏమైనా పండగ పూట ఆ తల్లి తన ప్రాణం తీసుకోవడమే కాకుండా ఇద్దరు చిన్నారుల ప్రాణం తీయడం స్థానికుల మనసులను ఆవేదనతో ముంచేసింది. సమస్య ఏదైనా పరిష్కారం ఉంటుంది కానీ తొందరపడి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఇద్దరు పిల్లల్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న నాగలక్ష్మి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications