తన చెల్లెలితో వివాహేతర సంబంధం, భర్తపై కోపంతో కొడుకును చంపిన తల్లి
హైదరాబాద్: భర్త పైన కోపంతో ఓ తల్లి కన్న కొడుకును హత్య చేసిన దారుణ సంఘటన హైదరాబాద్‌లోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తన భర్తకు తన చెల్లెలితో సంబంధం ఉందనే ఆగ్రహం కారణంగా ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఇది ఈ దారుణానికి కారణమైంది.
పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం మధ్య జరిగింది. మహమ్మద్ ముకర్రం, నుస్రత్‌లు భార్యాభర్తలు, పదేళ్లుగా వారు మాదన్నపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ఓ కొడుకు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

చెల్లెలితో వివాహేతర సంబంధం ఉందని అనుమానం
తన భర్తకు తన చెల్లెలితో వివాహేతర సంబంధం ఉందని ముకర్రం భార్యకు అనుమానం ఉంది. మా చెల్లితో సంబంధం పెట్టుకున్నావని ఆమె నిత్యం భర్తతో గొడవపడేది. వీరిద్దరి మధ్య గొడవలు మహిళా పోలీస్ స్టేషన్‌కు గతంలో చేరాయి. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇప్పించారు.

ఇంటిని మార్చాలని పోలీసుల సూచన
కౌన్సెలింగ్ అనంతరం వారు ప్రస్తుతం ఉంటున్న ఇంటిని మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసులు సూచించారు. మరో ప్రాంతానికి వెళ్లమని చెప్పారు. దీంతో భర్త ముకర్రం బండ్లగూడలో ఉండేందుకు ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇదే విషయాన్ని భార్యకు చెప్పాడు.

పెద్ద గొడవ
ఆదివారం రాత్రి తిరిగి భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అది పెద్ద గొడవగా మారింది. ఈ సమయంలో మూడేళ్ల కొడుకు రెహాన్ సంప్‌లో పడి మృతి చెందాడు. అయితే తన భార్యనే తనపై కోపంతో కొడుకును చంపిందని భర్త ముకర్రం ఆరోపించాడు.

నాపై కోపంతో చిన్నారిని చంపేసిందని ఫిర్యాదు
తనపై తీవ్ర కోపంతో భార్య తన చిన్నారిని సంప్‌లో పడవేసి చంపేసిందని అతను మాదన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక వచ్చిన అనంతరం హత్యా లేక సంప్‌లో పడి చనిపోయాడా, అన్న విషయం నిర్ధారణకు వస్తామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications