లిక్కర్ లేడీ.. నీకు భయమైతే నీ అయ్యను నాపై పోటీకి నిలబెట్టు: అరవింద్ సవాల్
బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కెసిఆర్ పై, కవిత పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల రాకముందే టీఆర్ఎస్ పార్టీని పంపించేశారు అని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఇప్పుడు భారత జాగృతి అయిందని ఎద్దేవా చేసిన ఆయన టిఆర్ఎస్ పార్టీ తో కెసిఆర్ దేశమంతా తిరుగుతాడట, ఇక రాష్ట్రాన్ని కేటీఆర్ కు అప్పగిస్తాడట అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ తో కలవటం కోసమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది : ఎంపీ అరవింద్
కేసీఆర్ దుర్మార్గుడు, మూర్ఖుడే కాదు... దోపిడీ దొంగ అంటూ తీవ్ర విమర్శలు చేశారు ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ పార్టీ తో కలవడం కోసమే టిఆర్ఎస్ పార్టీని బి ఆర్ ఎస్ పార్టీగా మార్చారని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఇక ఈ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు సోయి వచ్చింది కానీ నాయకులకి రావాలంటూ అరవింద్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కెసిఆర్ కు అప్పగించాలన్న డీల్ ను కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్నారని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ ఇచ్చేది కూడా కెసిఆర్ అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బేవకూఫ్ ని చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ని ఏర్పాటు చేశారు తప్ప, ఇంకా ఏమీ లేదన్నారు.

కేటీఆర్, కవితలపై అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు
కెసిఆర్ ప్రధాని వచ్చినా స్వాగతం పలకడని, కేటీఆర్ సాఫ్ట్ వేర్ వాళ్ళతో, బాలీవుడ్ వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు అని, రాత్రుళ్ళు మ్యూజిక్ వింటాడని వ్యాఖ్యలు చేశారు. ఇక లిక్కర్ లేడీ మా ఇంటి పైకి గూండాలను దాడికి పంపిందని ఆరోపించిన ధర్మపురి అరవింద్, కవిత జాగృతి గురించి పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ఆంధ్రా ఎంపీ తనతో పార్లమెంటులో ఈ భారత జాగృతి ఏంటి అని అడిగాడని, దానికి తాను సమాధానంగా కవిత తలుచుకుంటే మైక్ టైసన్ కు బాక్సింగ్, విరాట్ కోహ్లీకి క్రికెట్ నేర్పిస్తుంది అని చెప్పానని పేర్కొన్నారు.

నీకు భయంగా ఉంటే నాపై మీ అయ్యను నిలబెట్టు కవిత
నన్ను వెంటాడి, వేటాడి నా మీద నిలబడతా అన్న కవిత.. ఇప్పుడు అయ్య ఎక్కడ చెప్తే అక్కడే అంటోంది అంటూ ఎద్దేవా చేశారు. నా మీద కవిత నిలబడాలా..? లేదా? అని ప్రశ్నించిన ధర్మపురి అరవింద్, నీకు భయం లేకపోతే... నువ్వు నిలబడు, లేకపోతే నాపై మీ అయ్యను నిలబెట్టు అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల అప్పులు చేశారని, ఎలక్షన్లలో పెట్టే ఖర్చు వందల కోట్ల రూపాయలకు తీసుకెళ్లారని అసహనం వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలన కావాలంటే బిజెపి రావాలని పేర్కొన్నారు. దందాలు, మాఫియాలు చేసే బి ఆర్ ఎస్ నాయకులు కావాలా? ఆలోచించుకోవాలని ధర్మపురి అరవింద్ బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications