ఆ కారణంతోనే వెళ్తున్నా... విజయమ్మ ఆత్మీయ సమ్మేళనంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్...
వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది రాజకీయేతర సమావేశమని చెబుతున్నప్పటికీ... అంతకుమించిన ఎజెండా ఉండొచ్చుననే వాదన వినిపిస్తోంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇందులో వైఎస్సార్‌తో కలిసి పనిచేసినవారు,ఆయన కుటుంబానికి సన్నిహితులు ఉన్నారు. అయితే వీరిలో ఎంతమంది సమావేశానికి హాజరవుతారనేది చర్చనీయాంశంగా మారింది.
వైఎస్సార్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న కేవీపీ రామచంద్రరావు విజయమ్మ నిర్వహించే సమావేశానికి వెళ్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ సమావేశానికి వెళ్తున్నట్లు తెలిపారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగానే ఆత్మీయ సమావేశానికి వెళ్తున్నానని చెప్పారు. ఇది రాజకీయాలకు అతీతంగా జరగబోతున్న సమావేశమని పేర్కొన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సమావేశంపై స్పందిస్తూ...విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం వ్యక్తిగత అంశమని పేర్కొన్నారు. అది ఫ్యామిలీ ఫంక్షన్ అని వ్యాఖ్యానించారు. వారికి ఆత్మీయులుగా ఉన్న నాయకులను పిలిచారనే సమాచారం ఉందన్నారు.
విజయమ్మ నిర్వహించే సమావేశం కేవలం ఆత్మీయ సమ్మేళనమే అని చెబుతున్నప్పటికీ... అంతర్గత ఎజెండా మాత్రం రాజకీయమే అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో తన కూతురు వైఎస్ షర్మిలను రాజకీయంగా నిలబెట్టేందుకు విజయమ్మ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని... అందులో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్‌తో కలిసి పనిచేసిన ఇక్కడి నేతలను షర్మిల పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.
వైఎస్ షర్మిల నేత్రుత్వంలోని వైఎస్సార్‌టీపీకి తెలంగాణ సమాజం నుంచి ఆశించినంత స్పందన లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీలో చేరికలు కూడా పెద్దగా కనిపించట్లేదు. ఇటీవలే ఇందిరా శోభన్ లాంటి కీలక నేత పార్టీ నుంచి తప్పుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చేస్తున్న దీక్షకు సైతం అనుకున్నంత స్థాయిలో స్పందన లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే షర్మిల పార్టీ తెలంగాణలో నిలబడటం కష్టమనే వాదన ఉన్నది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతోనే విజయమ్మ రంగంలోకి దిగుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications