BRS: బీఆర్ఎస్ కు షాక్.. మరో ఎంపీ రాజీనామా..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు నేతలు. ఒక్కోక్కరుగా నేతలు పార్టీని వీడుతున్నారు. కేసీఆర్ వెళ్లే వారు వెళ్లొచ్చు.. ఒక్కరిద్దరు పోతే పోయేది ఏం లేదన్నారు. అయినప్పటికీ నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నానని రంజిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఇంతకాలం తనకు పార్టీలో సహకరించిన అందరికీ రంజిత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఇన్ని రోజులు చెవేళ్ల ప్రజలను సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కేసీఆర్ ను రంజిత్ రెడ్డి కోరారు. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రంజిత్ రెడ్డి ఈటలకు దగ్గర అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి టికెట్ హామీ రావడంతో హస్తం పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

చెవెళ్ల నుంచి సునీత రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని ప్రచారం జరిగింది. కానీ రంజిత్ రెడ్డికి టికెట్ హామీ వచ్చినట్లు సమాచారం. రంజిత్ రెడ్డి 2004లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రంజిత్ రెడ్డి 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై 14 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో రజింత్ రెడ్డి విజయం సాధించారు. రంజిత్ రెడ్డి పార్లమెంట్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా కొనసాగుతోన్నారు.
కాగా బీఆర్ఎస్ ఎంపీలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ రాములు రాజీనామా చేశారు. తాజాగా రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం వరంగల్ ఎంపీ పసనూరి దయాకర్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కొంత ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications