మునుగోడు వార్.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు షాక్.. ప్రచారం అడ్డగింత, ఉద్రిక్తత!!
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిని మించి ఒకరు ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలను పేలుస్తున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిగా నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాంపల్లి లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా నేడు ఆయనకు ఊహించని షాక్ తగిలింది.

కూసుకుంట్లకు ప్రచారంలో నిరసన సెగ
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నాంపల్లి లో టిఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని వారు ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా నాంపల్లి అభివృద్ధి పై దృష్టి సారించ లేదని వారు మండిపడ్డారు. సీఎం కెసిఆర్ కు, మంత్రి కేటీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇక కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అడ్డుకోవడంతో టిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య ఘర్షణ , ఉద్రిక్తత
దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగగా విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో మళ్లీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్లను మాత్రమే కాకుండా, బిజెపి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కూడా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ని మోసం చేసి, పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరారని నిప్పులు చెరుగుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనను నిలదీస్తున్నారు.

మునుగోడులో ప్రచారం పీక్స్ కు... కొన్ని చోట్ల ప్రతిఘటనలతో రచ్చ
ఇదిలా ఉంటే నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్న అన్ని రాజకీయ పార్టీలలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి, కేంద్రంలోని అధికార బిజెపికి, సిట్టింగ్ స్థానమైన మునుగోడును చేజిక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నది అన్ని రాజకీయ పార్టీలకు కునుకు లేకుండా చేస్తుంది. ఏది ఏమైనా మునుగోడు ఎన్నికల పోరులో ప్రచారం పీక్స్ కు చేరడంతో, కొన్ని చోట్ల ప్రతిఘటనలు చోటుచేసుకోవడంతో రచ్చ కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications