ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన నల్గొండవాసి అంశాల స్వామి కన్నుమూత; కేటీఆర్ ట్వీట్!!
ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన నల్గొండ వాసి అంశాల స్వామి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన, ఫ్లోరోసిస్ బాధ నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యను తెలియజేసిన అంశాల స్వామి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

ఫ్లోరోసిస్ బాధితుల తరపున పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూత
చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారిన పడిన అంశాల స్వామి ఫ్లోరోసిస్ రక్కసిని రూపుమాపటం కోసం పెద్ద సమరమే చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ బాధితుల తరఫున తన గళాన్ని దేశానికి వినిపించేలా పోరాటం చేశారు. వాజ్పేయి టేబుల్ పైన ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి ఫ్లోరోసిస్ బాధితుల కష్టాలను కళ్లకు కట్టాడు. గల్లి నుంచి ఢిల్లీ వరకు తనలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని నల్గొండ ఫ్లోరోసిస్ అంశాన్ని తెలియజేసేలా అనేక పోరాటాలు చేశారు. ఈరోజు అనారోగ్యంతో బాధపడుతూ అంశాల స్వామి తుది శ్వాస విడిచారు.

ఫ్లోరోసిస్ బారి నుండి నల్గొండ ను కాపాడటం కోసం పోరాటం
ఫ్లోరోసిస్ బాధితుడు, ఫ్లోరోసిస్ విముక్తి కోసం పోరాటం చేసిన సమరయోధుడు అంశాల స్వామి మృతి పట్ల పలువురు నాయకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఫ్లోరోసిస్ బారి నుండి నల్గొండ ను కాపాడటం కోసం స్వామి చేసిన అనేక పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంశాల స్వామి సొంత ఊరు మునుగోడు నియోజకవర్గం లోని శివన్న గూడెం. ఫ్లోరోసిస్ పై స్వామి చేసిన పోరాటం శివన్న గూడెం గ్రామస్తులందరికీ తెలిసిందే.

నాటి ప్రధాని వాజపేయి టేబుల్ పై అంశాల స్వామి.. నల్గొండ ఫ్లోరోసిస్ కు సాక్ష్యం
గతంలో ఫ్లోరైడ్ రక్కసి పై సాగించిన పోరాటంలో భాగంగా జలసాధన సమితిని స్థాపించిన దుశ్చర్ల సత్యనారాయణ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో స్వామిని ఢిల్లీకి తీసుకువెళ్లి, ఫ్లోరోసిస్ బాధితుల గోడును వినిపించారు. వాజ్పాయ్ టేబుల్ పైన స్వామిని పడుకోబెట్టి ఫ్లోరోసిస్ సమస్యను ఆయనకు వివరించారు. కానీ ఆ సమస్యకు ఆనాడు పరిష్కారం దొరకలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ ఫ్లోరోసిస్ రక్కసిని రూపుమాపటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలే జరిగాయి.

తెలంగాణా ఏర్పాటైన తర్వాత ఫ్లోరోసిస్ నుండి విముక్తి.. స్వామి ఇంటికి కేటీఆర్
ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మునుగోడు నియోజకవర్గంలోని మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, సురక్షిత మంచినీటిని అందించి నియోజకవర్గ ప్రజలను ఫ్లోరోసిస్ నుండి విముక్తి కల్పించారు. ఇక అంశాల స్వామి పోరాటాన్ని గుర్తించిన కేటీఆర్ గతేడాది అంశాల స్వామి సొంతింటి కలను నెరవేర్చారు. ఇక మునుగోడు ఉపఎన్నిక సమయంలోను అంశాల స్వామి ఇంటికి వెళ్ళిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అంశాల స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కానీ అంశాల స్వామి అనారోగ్య కారణాలతో ఈరోజు తుది శ్వాస విడిచారు.
అంశాల స్వామి మృతి పట్ల కేటీఆర్ సంతాపం
అంశాల స్వామి మృతి పట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన అంశాల స్వామి ఫ్లోరోసిస్ బాధితుడు.. వారికోసం నిరంతరం పోరాటం చేశారని ఆయన ఎంతోమందికి స్ఫూర్తి అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. అంశాల స్వామి ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతాడని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. అంశాల స్వామితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను కేటీఆర్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications