ఘోర ప్రమాదం: లారీని ఢీకొన్న ఆటో, ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు
నల్గొండ: జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలోరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
మృతుల్లో ఆటో డ్రైవర్ సహా ఆరుగురు మహిళలున్నారు.
మృతులను చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందినవారిగా గుర్తించారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు.

కూలీలు వరినాట్ల కోసం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనా స్తలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందినవారిలో ఆటో డ్రైవర్ మల్లేశం, నోమల పెద్దమ్మ, నోమల సైదమ్మ, కొట్టం పెద్దమ్మ, గొడుగు ఇద్దమ్మ, మల్లమ్మ ఉన్నారు. ఆరుగురి మృతితో సుద్దబావితండాలో విషాదం నెలకొంది.