తెలంగాణలో మరో 4 రోజులపాటు భారీ వర్షాలు: వడగండ్ల వానలు కూడా, ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్: ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. అయితే, మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. శని, ఆదివారాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
శనివారం దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. ఆదివారం ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి, కిందిస్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న క్రమంలో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
శనివారం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో.. రేపు, ఎల్లుండి గంటకు 40 నుంచి 50 కీమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో రాగల 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 30 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వడగండ్ల వానలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగింది. దీంతో తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చేతికందిన పంట వానలతో దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, పంట నష్టం అంచనా వేయాలని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, అధికారులు తమ వద్దకు వచ్చి పంటనష్టాన్ని అంచనా వేయడం లేదని పలు ప్రాంతాల్లోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, హైదరాబాద్ నగరంలో శనివారం కురిసిన భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరదనీరు చేరడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. దీంతో ఆ ప్రాంత వాసులకు ఇబ్బందులు తప్పలేదు. కళాసిగూడలో ఓ నాలా తెరుచుకుని ఉండటంతో అందులో పడి ఓ 11 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో ఆ చిన్నారి కుటుంబంతోపాటు స్థానికంగా విషాదం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications