ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ తప్ప కేసీఆర్ బీఆర్ఎస్ సభను ఎవరూ పట్టించుకోలేదు: బండి సంజయ్
ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్ప నిన్న బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ సభకు వచ్చిన జనాలు, నేతలు ఎవరు మనస్ఫూర్తిగా పాల్గొనలేదని, బెదిరించి సభను సక్సెస్ చేయాలని చూశారంటూ బండి సంజయ్ ఆరోపించారు.

బీఆర్ఎస్ సభకు వారెందుకు రాలేదు
కెసిఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కర్ణాటక మాజీ సీఎం, బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా రాలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ దగ్గర ఉన్న లిక్కర్ డబ్బులు పంచుకోవడానికి ఆయా రాష్ట్రాల జాతీయ నేతలు వచ్చినట్టు ఉన్నారని బండి సంజయ్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారు. కెసిఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ గురించి మాట్లాడితే అక్కడ తిండి గురించి కొట్లాడుకుంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. భారతదేశం బాగుందని కేసీఆర్ నోటిమాట వస్తే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

కెసిఆర్ వేషం, భాష చూస్తే తుపాకి రాముడు గుర్తొచ్చాడని బండి సంజయ్ వ్యాఖ్యలు
కెసిఆర్ వేషం, భాష చూస్తే తుపాకి రాముడు గుర్తొచ్చాడని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ఒక జోకర్ అని, ఖమ్మం సభలో ఆయన మాట్లాడింది జోకర్ మాటలేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నిన్న ఖమ్మం సభలో ఇచ్చిన స్పీచ్ గతంలో మాట్లాడిందేనని కొత్తగా మాట్లాడింది ఏమీ లేదని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, దేశానికి దిక్సూచి అయిందని కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ప్రశ్నించారు.

తెలంగాణాలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో అర్ధం కాని పరిస్థితి
తెలంగాణ రాష్ట్రంలో 21 డ్యామ్ ల నిర్మాణాలను ఎనిమిది సంవత్సరాల నుంచి పెండింగ్లో పెడుతున్నారని మండిపడిన బండి సంజయ్, తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. పొలం దగ్గర కరెంట్ ఫ్రీ అని చెప్పి, ఇళ్ల దగ్గర అదనపు వసూళ్లు చేస్తున్నారని, డిస్కం లకు డబ్బులు కట్టకుండా ఫ్రీ కరెంట్ అని చెబుతున్నారని, బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ముందు వారికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని హితవు పలికారు.

దళితులను మోసం చేసిన కేసీఆర్ కు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు
వందే భారత్ రైళ్ళు దేశీయంగా మేకింగ్ ఇండియాలో భాగంగా తయారయ్యాయని బండి సంజయ్ పేర్కొన్నారు. దళితులకు సీఎం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించిన బండి సంజయ్ దళితులను మోసం చేసిన కేసీఆర్ కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీతో కేసిఆర్ జతకట్టాడని బండి సంజయ్ విమర్శించారు.

ఖమ్మం సభకు వచ్చిన నేతలు వివిధ స్కాం లలో ఉన్నారు
ఖమ్మం సభకు వచ్చిన నలుగురు నేతలు నాలుగు స్కాంలలో ఉన్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు. వచ్చిన నేతలలో ఒక్కరు కూడా బి ఆర్ ఎస్ పార్టీ గురించి మాట్లాడలేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దేశంలో వచ్చేది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అని కేజ్రీవాల్ ప్రకటించారని పేర్కొన్న బండి సంజయ్, అలాంటప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఖమ్మం సభలో కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని మాట్లాడలేదని, తెలంగాణను మర్చిపోయిన కేసీఆర్ తో జై తెలంగాణ అనిపించి తీరుతామని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications