చంద్రబాబు ఎఫెక్ట్: టీలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం కిరోసిన్ పోసి తగులబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను నిరసిస్తూ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. చంద్రబాబు గతంలో వస్తున్నా మీకోసం పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద 100 అడుగుల పైలాన్ నిర్మించారు.

అక్కడే ఎన్టీఆర్ విగ్రహాన్ని 2013 జనవరి 9వ తేదీన ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఇప్పుడు గుర్తు తెలియని దుండగులు కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. విగ్రహం పాక్షికంగా కాలిపోయింది. అది కుడివైపుకు ఒరిగింది. దీనిని స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
కాగా, విద్యుత్, తెలంగాణ అభివృద్ధిపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నోసార్లు ఆహ్వానించినా ఆయన ముఖం చాటేశారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ వరంగల్ జిల్లా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications