తెలంగాణ: ప్రతిపక్షాల బలహీనతలే కెసిఆర్ బలమా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఢీకొట్టడంలో ప్రతిపక్షాలు విఫలమైనట్లే కనిపిస్తున్నాయి. పలు సమస్యలను ముందుకు తెచ్చి ప్రతిపక్షాలు ఆయనను ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించాయి. రైతుల ఆత్మహత్యలు, విశ్వవిద్యాలయ భూముల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం, అక్రమ కట్టడాల కూల్చివేత, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి పలు కెసిఆర్ నిర్ణయాలపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో పాటు బిజెపి కూడా కెసిఆర్‌ను చిక్కుల్లో పడేయాలని చూశాయి.
అయితే, కెసిఆర్‌ను ఆ సమస్యలేవీ కదిలించలేకపోయాయి. తాజాగా, నోటుకు ఓటు కేసు కెసిఆర్‌కు మరింత బలాన్ని ఇచ్చినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఆయన తెలుగుదేశం పార్టీని లక్ష్యం చేసుకున్నారు. ఆయన లక్ష్యమంతా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయడమే. అందుకుగాను రాజకీయంగా ఆయన పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేశారు. టిడిపిలో బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో తనపై తీవ్రమైన విమర్శలు చేసిన నాయకులను కూడా దరి చేర్చుకుని పదవులు ఇచ్చారు.
అధికారంలో ఉండే పార్టీలోకి సహజంగానే ఇతర పార్టీల నాయకులు రావడం సహజం. తెలంగాణలో కాంగ్రెసు, టిడిపి శాసనసభ్యులు టిఆర్ఎస్ వైపు చూడడం సహజమైన విషయమే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిడిపిలోకి వెళ్లినట్లుగానే తెలంగాణలో టిడిపి, కాంగ్రెసు శాసనసభ్యులు టిఆర్ఎస్‌లోకి వెళ్లారు.

రాజకీయంగా కాంగ్రెసు, టిడిపిలను కెసిఆర్ బలహీనపరుస్తూ వచ్చారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెసు, టిడిపిలు పోషించిన పాత్ర కూడా ఆ పార్టీలు రాష్ట్ర ఏర్పాటు తర్వాత పుంజుకోకపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. కాంగ్రెసు పార్టీ తెలంగాణలో ఘోరంగా దెబ్బ తిన్నది. ఆ పార్టీలో విభేదాలు ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెసుకు సమర్థమైన నాయకత్వం లోపించింది. దానికి అంతర్గత విభేదాలు కూడా తోడయ్యాయి.
తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే కెసిఆర్ వ్యూహాలకు అది దెబ్బ తింటూ వచ్చింది. అదే సమయంలో తెలంగాణలో తిరిగి బలం పుంజుకోవడానికి అది విశేషంగానే కృషి చేసింది. చంద్రబాబునాయుడు వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించి ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు, కెసిఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో తిరిగి బలం పుంజుకోవడానికి టిడిపి ప్రయత్నిస్తున్న తరుణంలో నోటుకు ఓటు కేసు బయటపడి పెద్ద దెబ్బనే తీసింది.
దానికితోడు, తెలంగాణ టిడిపిలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. నాయకుల మధ్య విభేదాలు కూడా ఆ పార్టీని దెబ్బ తీశాయని చెప్పవచ్చు. నోటుకు ఓటు కేసులో పట్టుబడడానికి ముందు రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్సిస్తూ వచ్చారు. ఆయనకు చంద్రబాబు నుంచి కూడా ప్రోత్సాహం లభించింది. ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి సీనియర్ నాయకులకు మింగుడు పడలేదనే చెప్పవచ్చు.
తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా బిజెపి విస్తరణకు అవకాశాలు లేకుండా చేసుకుంది. అదే సమయంలో వ్యూహాత్మకంగా కెసిఆర్ మజ్లీస్‌తో దోస్తీ కట్టారు. మరోవైపు, ప్రభుత్వపరంగా కెసిఆర్ వివిధ పథకాలకు శ్రీకారం చుడుతూ ప్రజల్లోకి వెళ్తూ వస్తున్నారు. ప్రభుత్వోద్యోగులకు ఫిట్మెంట్, ఆర్టీసి కార్మికులకు వేతనం పెంపు వంటి విషయాల్లో చంద్రబాబుపై ఆయన పైచేయి సాధించడానికి ప్రయత్నించారు. మొత్తంగా, కెసిఆర్ కన్నా విశ్వసనీయమైన నేత, ప్రజాకర్షన గల నేత, వ్యూహాల్లో దిట్ట ఇతర పార్టీలకు లేకుండా పోయాడు.
దానికితోడు, కెసిఆర్ మీడియా బలం తెలిసినవారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఆయన చేతుల్లో టీ న్యూస్ చానెల్ ఉంది. తన చేతి నుంచి జారిపోయిన నమస్తే తెలంగాణ దినపత్రికను ఆయన తిరిగి తన చేతుల్లోకి తీసుకున్నారు. మరోవైపు, చంద్రబాబుకు అండగా నిలుస్తూ వస్తున్న మీడియాకు దీటుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా, కెసిఆర్‌కు చెందిన మీడియా తయారయ్యాయి.
నిజానికి, కెసిఆర్‌కు రాజకీయంగా కళ్లెం వేయగల సమర్థ నాయకుడు నారా చంద్రబాబు నాయుడే. నోటుకు ఓటు కేసుకు ముందు చంద్రబాబు అదే ప్రయత్నం చేశారు. అయితే, నోటుకు ఓటు కేసు ముందుకు రావడంతో కెసిఆర్ చంద్రబాబు మీద పైచేయి సాధించారు.












Click it and Unblock the Notifications