Parliament elections 2024: ఆ బీజేపీ త్రయంపై ఆసక్తికర చర్చ
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ, ఎవరు ఊహించని విధంగా కీలక నేతలు ఓటమిపాలయ్యారు. ఇక ఈ ఓటమి నేపథ్యంలో బిజెపిలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఎనిమిది స్థానాలను గెలుపొందింది. 18 శాతం ఓటింగ్ ను కూడా దక్కించుకుంది.
19 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు రెండవ స్థానంలో నిలువగా, 49 స్థానాలలో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లను దక్కించుకున్నారు. ఇలా చూసుకుంటే బిజెపి గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పుంజుకుంది అనే చెప్పాలి. అయితే బిజెపిలో ప్రస్తుతం ఓటమిపాలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు తదితర నేతల పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానంలోనే గెలుపొందలేకపోయిన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు లను ఎంపీ ఎన్నికల బరిలోకి దింపితే వారు గెలిచే అవకాశం ఉందా? ఒక్క అసెంబ్లీలోనే ఆదరించని వీరిని పార్లమెంటు స్థానంలో ఏ విధంగా ఆదరిస్తారు? వీరికి టికెట్ ఇస్తే గెలిచి వస్తారా లేకుంటే లోక్సభ ఎన్నికలలోను ఓటమిపాలు చేస్తారా అన్నది ప్రస్తుతం అందరిలో జరుగుతున్న చర్చ.

తెలంగాణలో బిజెపికి రాష్ట్రవ్యాప్తంగా ఓటుబ్యాంకు పెరిగినా బిజెపిలో కీలక నేతలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘు నందన్ రావు వంటి నేతలను ప్రజలు ఆదరించలేదు. వీరిని ఆదరించక పోవడం వెనుక అనేక కారణాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గంలో వీరి వల్ల జరిగిన అభివృద్ధి లేదని, పేరుకే పెద్దనేతలుగా చెప్పుకుంటున్న వీరు చేస్తున్నది ఏమీ లేదని వీరిపై అసహనం వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు.

ఈ క్రమంలోనే దిగ్గజ నేతలను సైతం ఓటర్లు ఓటమి పాలు చేసి కీలక నేతలను ఆత్మవిమర్శ చేసుకోమన్నారు. ఇదిలా ఉంటే వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న ఇటీవల అసెంబ్లీలో ఓడిపోయిన బీజేపీ ఎంపీలు మళ్లీ తమ తమ స్థానాలలో పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వీరిపై నమ్మకంతో అధిష్టానం మళ్ళీ వీరికి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఇస్తుందా లేదా అన్నది మాత్రం పార్టీశ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది.
ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికలు బిజెపికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కాగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సంపాదించడానికి అధినాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఫెయిల్యూర్ నేతలనే మళ్లీ రంగంలోకి దింపుతుందా? అన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications