అక్కడ దేశభక్తితో పాటు ఓటరు చైతన్యం వెల్లివిరుస్తుంది!!
దేశం మీద ప్రేమ వ్యక్తం చెయ్యటం ఎలా? మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకోవటం ఎలా? ఇలా అనేక దేశానికి సంబంధించిన విషయాల మీద అవగాహన కలిగిస్తూ ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని పెంపొందిస్తుంది నల్గొండ జిల్లాకు చెందిన జనగణమన ఉత్సవసమితి. ప్రతీరోజూ ఖచ్చితంగా 8.30గంటలకు 12సెంటర్లలో జనగణమన గీతాలాపన మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో తనవంతు కర్త్యవ్యాన్ని నిర్వర్తిస్తుంది.
ఓటు వేయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన విధంగా వాడుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తించిన జనగణమన ఉత్సవ సమితి నేడు ఓటరు అవగాహన ర్యాలీ, ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టింది. జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల సంఘం సహకారంతో నల్లగొండ లో ఎథికల్ ఓటింగ్ పై ఓటరు అవగాహన ర్యాలీ, ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం 8.30గంటలకు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నిత్య జాతీయ గీతాలాపనలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.. పట్టణంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవటు కళాశాలల విద్యార్దులు, సామాజిక సేవావిభాగం తరపున యువతతో ఓటు హక్కు వినియోగించుకోవాలి, నిజాయితీగా ఓటు వేయాలనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది.
ర్యాలీ అసంతరం జిల్లా పరిషత్ సిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి అద్యక్షతన జరిగిన క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఓటు హక్కుపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు జనగణమన ఉత్సవ సమితి వారి సహకారంతో పట్టణంలోని 12కేంద్రాలలో ఏకకాలంలో ఓటరు ప్రతిజ్ణ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యం మనకు ఇచ్చిన హక్కు ఓటు, దాన్ని అమ్ముకుంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్లేనని అన్నారు.
నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. మన ఓటుతోనే మార్పు సాధ్యమవుతుందిని, మన ఒక్క ఓటు తోనే అభ్యర్థులు, ప్రభుత్వాల భవిష్యత్తు తారుమారు చేయవచ్చని , ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్రంలోనే అత్యధిక ఓటింగ్ శాతం నల్లగొండ జిల్లా నుంచి నమోదు చేయాలని అన్నారు.. జనగణమన ఉత్సవసమితి అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కర్నాటి విజయ్ కుమార్, కొలనుపాక రవికుమార్, సభ్యులు గుంటి రామకృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications