సికింద్రాబాదులో చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ ఈమెనే
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చిన్నారిని గుర్తుతెలియని అగంతకురాలు కిడ్నాప్ చేసింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం - తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలుకు చెందిన రాణి నగరంలో ఉంటున్న తన సోదరుడి ఇంటికి ఐదేళ్ల కుమార్తె దుర్గతో వచ్చింది.
శుక్రవారం తిరిగి తన స్వగ్రామానికి వెళ్లడానికి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్ ఆవరణలో రాణితో గుర్తుతెలియని అగంతకురాలు చనువుగా మాట్లాడడంతో ఇరువురు కలిసి కొంతసేపు ముచ్చటించుకున్నారు. ప్రక్కనే తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు.

రాణి స్టేషన్‌లోకి వెళ్లడానికి ముందు నడుస్తుండగా అగంతకురాలు చిన్నారి దుర్గను ఎత్తుకుని వెనకే వస్తున్నట్లు నటించింది. స్టేషన్ ఆవరణలోకి రాణి వెళ్లింది. తన కూతురు, అగంతకురాలు కనిపించకపోవడంతో కలత చెంది వెతికినా లాభం లేకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులు విషయం చెప్పింది.
చిన్నారి కోసం స్టేషన్ అంతా గాలించారు. స్టేషన్ బయట, లోపల ఉన్న సిసి ఫుటేజ్‌లను పరిశీలించి నిందితురాలి కదలికలను గుర్తించారు. చిన్నారిని ఎత్తుకుని స్టేషన్ నుంచి బయటికి వచ్చిన అగంతకురాలు బస్టాండ్‌కు వచ్చి ఎటు వైపు వెళ్లిందో తెలియకపోవడంతో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే పట్టుకుని చిన్నారిని రక్షిస్తామని ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు.












Click it and Unblock the Notifications